తిమింగ‌లాన్ని హింసించినందుకు దేశ మాజీ అధ్య‌క్షుడిపై కేసు !

అస‌లే అధికారం కోల్పోయి, ప‌లు కేసులు ఎదుర్కొంటూ ఆవేద‌న‌లో ఉన్న‌ బ్రెజిల్ మాజీ అధ్య‌క్షుడు బోల్స‌నారో మెడ‌కు మ‌రో కేసు చుట్టుకుంది.

  • Publish Date - November 20, 2023 / 10:03 AM IST

విధాత‌: అస‌లే అధికారం కోల్పోయి, ప‌లు కేసులు ఎదుర్కొంటూ ఆవేద‌న‌లో ఉన్న‌ బ్రెజిల్ (Brazil) మాజీ అధ్య‌క్షుడు బోల్స‌నారో మెడ‌కు మ‌రో కేసు చుట్టుకుంది. స‌ముద్రంలో తిరుగుతున్న ఒక తిమింగ‌లాన్ని (Humpback Whale) హింసించార‌ని ఆయ‌న‌పై కేసు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. ఈ ఏడాది జూన్‌లో ఓ ప‌బ్లిక్ హాలీడే సంద‌ర్భంగా ఆయ‌న ఓ బోటులో విహ‌రించినప్పుడు ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొన్నాయి.


ఆగ్నేయ బ్రెజిల్‌లోని సావో సెబాషియో స‌ముద్ర తీరంలో ఘ‌ట‌న జ‌రిగింద‌ని తెలిపాయి. వైర‌ల్ అవుతున్న వీడియోలో బోల్స‌నారో (Bolsonaro) ను పోలిన వ్య‌క్తి.. తిమింగ‌లానికి 15 మీట‌ర్ల దూరంలో బోటులో ఉన్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. స‌ద‌రు వ్య‌క్తి తిమింగ‌లాన్ని ఫొటోలు తీస్తూ చాలా సేపు అక్క‌డే ఉన్నారు. నిబంధ‌న‌ల ప్రకారం.. ఇంజిన్‌లు ఆన్ చేసి ఉన్న బోటును తిమింగ‌లానికి ద‌గ్గ‌ర‌గా తీసుకెళ్ల‌డానికి వీలులేదు. దానికి బోటుకు క‌నీసం 100 మీ., గ‌రిష్ఠంగా 300 మీ. దూరం ఉండాలి. దీనిని బోల్సనారో ఉల్లంఘించార‌నేది ప్ర‌ధాన ఆరోప‌ణ‌.


అయితే ప‌ర్యావ‌ర‌ణం, జీవుల ప‌ట్ల బోల్స‌నారో వైఖ‌రి గ‌తంలోనూ వివాదాస్ప‌ద‌మైంది. ఆయ‌న ప‌రిపాల‌నా కాలంలో ప‌ర్యావ‌ర‌ణానికి చేటు చేసేలే ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని అంత‌ర్జాతీయంగా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అందుకే విమ‌ర్శ‌కులు ఆయ‌న‌కు కెప్టెన్ చెయిన్‌సా అనే పేరు పెట్టారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయిన అనంత‌రం ఇప్పుడున్న ప్ర‌భుత్వం బోల్స‌నారోపై ప‌లు కేసులు న‌మోదు చేసింది.


ప‌ర్యావ‌ర‌ణానికి విఘాతం క‌లిగించే నిర్ణ‌యాలు తీసుకున్నార‌నే ఆరోప‌ణ‌ల ద‌గ్గ‌ర నుంచి రాజ‌కీయంగా అనైతిక ప్ర‌వ‌ర్త‌న‌ వ‌ర‌కు ప‌లు కేసుల‌ను ఆయ‌న ఎదుర్కొంటున్నారు. కొన్నింటిలో నేరారోప‌ణ రుజువు కావ‌డంతో 2030 వ‌ర‌కు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా ఆయ‌న‌పై కోర్టులు నిషేధం విధించాయి. కొన్ని రోజుల్లోనే ఆయ‌న జైలు పాల‌వుతార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తాజాగా తిమింగ‌లం ఘ‌ట‌నపై బోల్స‌నారో స్పందించారు. కొద్దిమంది రాజ‌కీయ నాయకులు, ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుల క‌క్ష‌పూరిత చ‌ర్య‌లే దీనికి కార‌ణ‌మ‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

Latest News