Site icon vidhaatha

Inauguration of New Parliament | అప్రజాస్వామిక చర్యలు మోదీకి కొత్తేమీ కాదు

Parliament |

విధాత : పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవ (Inauguration of New Parliament) కార్యక్రమం పై వివాదం మరింత ముదిరింది. ఈ కార్యక్రమాన్ని బాయ్‌కాట్‌ (boycott ) చేస్తున్నట్టు కాంగ్రెస్‌, వామపక్షాలు, ఆప్‌, టీఎంసీ, శివసేన (ఉద్దవ్‌) సీపీఎం సహా దాదాపు 19 ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి.

మోదీ చేతుల మీదుగా నూతన పార్లమెంటు భవనం ప్రారంభం కావడాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు.. ఆ గౌరవం దేశ ప్రథమ పౌరురాలైన ద్రౌపతి ముర్ముకే (Droupadi Murmu) దక్కాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

రాష్ట్రపతిని పూర్తిగా పక్కన పెట్టేసి, తానే పార్లమెంటును ప్రారంభించాలని మోదీ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి అవమానమే కాకుండా.. గొడ్డలిపెట్టు అని ప్రతిపక్షాలు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి.

నిత్యం పార్లమెంటును బలహీనపర్చే మోదీకి అప్రజాస్వామిక చర్యలు కొత్తేమీ కాదని వ్యాఖ్యానించాయి. రాష్ట్రపతి దేశానికి అధిపతి మాత్రమే కాదని, పార్లమెంటులో అంతర్భాగమని తెలిపాయి.

పార్లమెంటు సమావేశాలను ప్రారంభించేది, ప్రొరోగ్‌ చేసేది రాష్ట్రపతేనని, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేది కూడా రాష్ట్రపతేనని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 79ని ఉటంకిస్తూ ప్రతిపక్షాలు గుర్తు చేశాయి. పార్లమెంటు చేసిన చట్టం రాష్ట్రపతి ఆమోదంతోనే అమల్లోకి వస్తుందని, కానీ మోదీ మాత్రం రాష్ట్రపతి లేకుండానే నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశాయి.

హుందాతనం లోపించిన మోదీ చర్య రాష్ట్రపతిని అవమానించడమేనని, రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించడమేనని స్పష్టం చేశాయి. దేశానికి మొదటిసారిగా ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి అయిన స్ఫూర్తిని ఇది దెబ్బ తీస్తుందని పేర్కొన్నది.

ఈ సంయుక్త ప్రకటనపై కాంగ్రెస్‌, డీఎంకే, ఆప్‌, శివసేన (ఉద్దవ్‌), సమాజ్‌వాది పార్టీ, సీపీఐ, సీపీఎం, కేరళ కాంగ్రెస్‌(మణి), జేఎంఎం, ఆర్జేడీ, టీఎంసీ, జేడీయూ, ఎన్సీపీ, ఆర్‌ఎల్‌డీ, ఇండియన్‌ ముస్లిం లీగ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఆర్‌ఎస్‌పీ, ఎండీఎంకే ప్రతినిధులు సంతకాలు చేశారు.

నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్రమోదీ మే 28వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కనీసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆహ్వానం కూడా లేకపోవడంతోపాటు.. వీడీ సావర్కర్‌ జయంతి రోజున నిర్వహించడం కూడా వివాదానికి దారి తీసింది.

Exit mobile version