Site icon vidhaatha

Indians | సుఖ‌వంత‌మైన ఉద్యోగానికే భార‌తీయుల ఓటు.. మారుతున్న ధోర‌ణి

Indians |

ఏదైనా ఉద్యోగం వ‌స్తే చాలు అదే ప‌ది వేల‌నుకునే రోజులు పోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఏదో ఒక ఉరుకుల ప‌రుగుల ఉద్యోగం కోసం కాకుండా సౌల‌భ్యం (Comfort) గా ఉండే ఉద్యోగాల కోస‌మే భార‌త్‌లో యువ‌త ప్ర‌య‌త్నిస్తున్నారని ఓ అధ్య‌య‌నం (Study) వెల్ల‌డించింది. నిరుద్యోగుల‌ను స‌ర్వే చేయ‌గా 71 శాతం మంది త‌మ‌కు ఒత్తిడి లేని సుఖంగా ప‌నిచేసుకునే ఉద్యోగమే కావాల‌ని పేర్కొన్నార‌ని తెలిపింది.

వ‌ర్క్ ఫ్రం హోం అయితేనే చేస్తామ‌ని.. అదీ కూడా త‌మ‌కు న‌చ్చిన ప‌ని గంట‌ల్లోనే అందుబాటులో ఉంటామ‌ని.. స‌ర్వేలో పాల్గొన్న‌వారు తెలిపారు. వ‌ర్క్ లైఫ్ బ్యాలెన్స్‌నీ.. ఉత్పాద‌క‌త‌ను పెంచుకోవ‌డానికి ఇది అత్య‌వ‌స‌ర‌మ‌ని భావిస్తున్న‌ట్టు వారు పేర్కొన్నారు. 1200 మంది నిరుద్యోగుల‌ను, ఇప్ప‌టికే ఉద్యోగాల్లో ఉంటూ మార‌దామ‌నుకునే వారిని ప‌లు ప్ర‌శ్న‌ల‌పై అభిప్రాయ‌లు వెల్ల‌డించ‌మ‌ని కోర‌గా వారిచ్చిన స‌మాధానాలను విశ్లేషించారు.

పని చేస్తున్న వారిలో చాలా మంది రిమోట్ వ‌ర్కింగ్ విధానానికి గానీ, కుద‌ర‌క‌పోతే వ‌ర్క్ ఫ్రం హోమ్ విధానానికి గానీ వెళ్లిపోదామ‌ని భావిస్తున్నారు. 67 శాతం మంది ఇన్సూరెన్స్, సెల‌వులు, ఇత‌ర ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్నారు.

అయితే తాము కోరుకున్న ఉద్యోగ జీవితంలో 50 శాతం కూడా త‌మ సంస్థ‌లు క‌ల్పించ‌లేక‌పోతున్నాయ‌ని ఎక్కువ మంది వాపోయారు. లింక్డిన్‌, నౌక‌రీ డేటా ప్ర‌కారం జులైలో 6.5 శాతం ఉద్యోగాలు మాత్ర‌మే వ‌ర్క్ ఫ్రం హోమ్ అవ‌కాశాన్ని క‌ల్పించాయి.

2023లో రిమోట్ వ‌ర్కింగ్ విధానంలో ఉద్యోగాలు చేసే వారి సంఖ్య పెరిగిన‌ప్ప‌టికీ ఇది ఇప్ప‌టికీ స్వ‌ల్ప‌మే. అయితే 51 శాతం మంది మ‌ధ్యేమార్గంగా త‌మ‌కు హైబ్రిడ్ విధానం ఓకే అని చెప్పారు. ఇందులో అయితే కంపెనీకి వెళ్లి కొన్ని రోజులు, ఇంటి నుంచి కొన్ని రోజులు ప‌ని చేయొచ్చ‌ని పేర్కొంటున్నారు. జ‌న‌రేష‌న్ జెడ్‌, మిలీనియం త‌రం ఉద్యోగాల్లోకి రావ‌డ‌మే ఈ పోక‌డ‌కు కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ట్రాఫిక్ అతి పెద్ద సమ‌స్య‌

అయితే ఆఫీస్‌కు వెళ్లి పని చేయ‌డానికి ఎందుకు ఇష్ట‌ప‌డ‌టం లేద‌నే ప్ర‌శ్న‌కు చాలా మంది ట్రాఫిక్ (Traffic) అని స‌మాధానం చెప్ప‌డం విశేషం. తాజాగా రెడిట్ మాధ్య‌మంలో ఓ యువ‌కుడు చేసిన పోస్ట్ కూడా ట్రాఫిక్ క‌ష్టాల‌పై చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది. తాను ఉద్యోగంలో చేరిన మొద‌టి రోజే ట్రాఫిక్‌కు భ‌య‌ప‌డి రిజైన్ చేశాన‌ని దిల్లీకి చెందిన ఓ యువ‌కుడు చెప్పాడు.

ఒక మంచి కంపెనీలో కాస్త పెద్ద జీతంతో ఉద్యోగం వ‌చ్చింది. కానీ రానూ పోనూ 36 కి.మీ. ప్ర‌యాణించాలి. దీనికే రెండు గంట‌లు పోతుంది అందుకే ఉద్యోగానికి రాజీనామా చేశా అని రెడిట్‌లో పేర్కొన్నాడు. దీనిపై కొంద‌రు మంచి నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెబుతుండ‌గా.. మ‌రికొంద‌రు ఇది సిల్లీ రీజ‌న్ అని వ్యాఖ్యానిస్తున్నారు.

Exit mobile version