Maharashtra
విధాత: ఏ జంతువు కనిపించినా వేటాడటం పులి లక్షణం. అలా పులుల దాడిలో చాలా జంతువులు ప్రాణాలు కోల్పోతుంటాయి. అయితే ఇప్పటి వరకు పులి దాడిలో బర్రె మృతి అనే వార్తలు చాలానే చూసి ఉంటారు. కానీ బర్రెల దాడిలో పులి మృతి అనే వార్త చూసి ఉండరు. కానీ బర్రెల మూకుమ్మడి దాడిలో ఓ పెద్ద పులి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇది.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని మూల్ తాలుకా పరిసరాల్లో కొంతకాలంగా ఓ పెద్ద పులి సంచరిస్తోంది. ఆ పులిని చూసిన స్థానికులు ఒంటరిగా వెళ్లాలంటేనే గజగజ వణికిపోతున్నారు. గురువారం ఉదయం ఎస్గావ్ గ్రామ పరిధిలో ఓ పశువుల కాపరిపై ఆ పులి దాడి చేసేందుకు యత్నించింది. అప్రమత్తమైన కాపరి తన చేతిలో ఉన్న గొడ్డలితో ఎదురు తిరగడంతో ఆ పులి అక్కడ్నుంచి తప్పించుకుంది.
అటు నుంచి అదృశ్యమైన పెద్ద పులి.. బెంబాడా గ్రామ సమీపంలోని అడవుల్లో ప్రత్యక్షమైంది. అక్కడ మేత మేస్తున్న ఆవులు, బర్రెల మందపై పులి దాడికి యత్నించింది. కానీ ఆవులు, బర్రెలు ఐకమత్యంగా ఉండి.. కొమ్ములతో పులిపై దాడి చేశాయి. దీంతో తీవ్ర గాయాలపాలైన పెద్దపులి అక్కడే పడిపోయింది.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని, పులిని చికిత్స నిమిత్తం చంద్రపూర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ పులి గురువారం రాత్రి చనిపోయింది. అయితే బర్రెలు పులిని ఎదురించిన దృశ్యాలను పశువుల కాపర్లు తమ మొబైల్స్‌లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.