Akasa Air : దేశీయంగా విమానయాన సేవలు అందిస్తున్న ఆకాశ ఎయిర్ సంస్థ.. అంతర్జాతీయ సేవలను ప్రారంభించింది. అకాశ ఎయిర్‌కు సంబంధించిన తొలి అంతర్జాతీయ విమానం ముంబై నుంచి ఖతార్‌లోని దోహాకు వెళ్లింది. అంతర్జాతీయ మార్గాల్లో విమానాలు నడిపడం కోసం అకాశ ఎయిర్‌కు గత ఏడాది సెప్టెంబర్‌లోనే అనుమతి లభించింది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అందుకు అనుమతులు మంజూరు చేసింది.
ఆ తర్వాత అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ఆకాశ ఎయిర్ తాజాగా తొలి అంతర్జాతీయ విమానాన్ని ఖతార్‌కు పంపింది. ఖతార్‌తోపాటు కువైట్, జెద్దా, రియాద్‌లకూ విమాన సర్వీసులు నడిపేందుకు ఆకాశ ఎయిర్‌కు అనుమతులు లభించాయి. రాబోయే కొద్ది నెలల్లో అనుమతులు ఉన్న ఇతర దేశాలకు కూడా తమ విమాన సర్వీసులను ప్రారంభిస్తామని ఆకాశ ఎయిర్ తెలిపింది.
కొత్త ప్రారంభమైన అంతర్జాతీయ విమాన సర్వీసుతో దేశంలోని అహ్మదాబాద్, గోవా, వారణాసి, లక్నో, బెంగళూరు, ఢిల్లీ తదితర నగరాల నుంచి దోహాకు వెళ్లేవారికి, వచ్చేవారికి సౌలభ్యంగా ఉంటుందని ఆకాశ ఎయిర్ తెలిపింది. అందుకు తగినట్లు విమాన షెడ్యూళ్లలో మార్పులు చేయనున్నట్లు వెల్లడించింది.