Site icon vidhaatha

ఎన్నికలు పూర్తవగానే ధరలు పెంచడం BJPకి ఆనవాయితీ: KTR

విధాత: పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాగానే కేంద్ర ప్రభుత్వం ఎల్.పి.జి సిలెండర్ రీఫిల్లింగ్ ధరలను పెంచడం ఆనవాయితీగా పెట్టుకుందని మారిందని, బుధవారం నాడు డొమెస్టిక్ సిలిండర్ పై రూ.50, కమర్షియల్ సిలిండర్ పై రూ.350 పెంచడంపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు మండిపడ్డారు. ధరల పెంపుదలను నిరసిస్తూ శుక్రవారం నాడు నియోజకవర్గ, మండల, పట్టణ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి పిలుపునిచ్చారు.

ఎక్కడి వారు అక్కడే వినూత్నంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల ఆగ్రహాన్ని తెలియ జేయాలన్నారు. మహిళా దినోత్సవం రోజు కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలపై ఆందోళనలు చేయాలన్నారు. మహిళా దినోత్సవం రోజున ప్రధాని మోదీ ధరల పెంచి కానుకగా ఇచ్చారని అన్నారు.

2014 మార్చి 1వ తేదీన డొమెస్టిక్ ఎల్.పి.జి సిలిండర్ ధర రూ.410 కాగా ప్రస్తుతం రూ.1155కు చేరుకుందన్నారు. పెరుగుతున్న ధరలతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, దీనికి తోడు సిలిండర్ ధర పెంచి బ్రతకలేని పరిస్థితులు కల్పిస్తున్నారన్నారు. ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా ధరలను పెంచుతున్న తీరును సోషల్ మీడియా ద్వారా ఎండగట్టాలన్నారు.

ఉజ్వల పథకం క్రింద ప్రధాని మోదీ చేతుల మీదుగా సిలిండర్ స్వీకరించిన మహిళ సైతం స్టౌ మీద కాకుండా కట్టెల పొయ్యిలో వంట చేసుకుంటున్నదని ఎద్దేవా చేశారు. ప్రజాగ్రహాన్ని పరిగణనలోకి తీసుకుని వెంటనే సిలిండర్ ధరలను తగ్గించాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

Exit mobile version