Site icon vidhaatha

CM Jagan: జూలైలో విశాఖకు సీఎం జగన్.. ఇక అక్కడి నుంచే పాలన!

విధాత‌: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) విశాఖ (Vishakha) వెళ్ళేది మరో నాలుగు నెలలు వాయిదా పడినట్లు అయింది. ఉగాదికి అంటే మార్చి నెలాఖరుకు విశాఖ వెళ్తున్నాం అని గతంలో పదేపదే జగన్ చెప్పారు. మొన్న విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సు(Investment conference)లో పారిశ్రామికవేత్తల సమక్షంలోనూ తాను త్వరలో విశాఖ వచ్చేస్తున్నట్లు చెప్పారు. కానీ ఇప్పుడు జూలై(July)లో వెళ్దాం అని కేబినెట్లో మంత్రులకు చెప్పారు.

ఈ రోజు నుంచి ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రివర్గ భేటీ సాగింది. ఇందులో మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పరిపాలన రాజధానిగా విశాఖలో పాలనను జూలై నుంచి ప్రారంభించనున్నట్లుగా పేర్కొన్నారు. దీంతో.. జూలైలో ఏపీ ప్రభుత్వ పాలన విశాఖ పట్నానికి షిఫ్టు అయ్యే ముహుర్తం ఫిక్సు అయిపోయినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఇటీవల ఢిల్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్ (YS Jagan Mohan Reddy) విశాఖకు తాను షిఫ్టు కానున్న విషయాన్ని ప్రకటించారే కానీ.. అదెప్పటి నుంచి అన్న విషయాన్ని మాత్రం వెల్లడించింది లేదు. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో చేసిన వ్యాఖ్య నేపథ్యంలో జూలై నుంచి పాలనా రాజధానిగా విశాఖను మార్చే ముహూర్తాన్ని చెప్పేసినట్లే. జూన్ మొదటి వారం నుంచి కొత్త విద్యా సంవత్సరం మొదలు కావటం.. అందుకు తగ్గట్లుగా ఉద్యోగులు ఏర్పాట్లు చేసేందుకు వీలుగా తాజా వ్యాఖ్య చేసి ఉంటారన్న మాట వినిపిస్తోంది.

ఏపీ పాలనా రాజధానిగా విశాఖ(Administrative capital Visakhapatnam) ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందన్న విషయంపై క్లారిటీ ఇచ్చిన ఆయన.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల మీద కూడా చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతను మంత్రులకు అప్పజెప్పారు. రాజధాని అంశం కోర్టులో ఉన్న నేపథ్యంలో ఆయన మార్చి ఏప్రిల్ నెలల్లో విశాఖపట్నం వెళ్లేందుకు న్యాయపరమైన అడ్డంకులు ఎదురవుతాయని అంటున్నారు. ఈలోపు ఈ చిక్కులన్నీ సమసిపోయాక జూలైలో ప్రశాంతంగా విశాఖ వెళ్లొచ్చని జగన్ ప్లాన్ చేసారని అంటున్నారు.

Exit mobile version