జూడాల ‘సమ్మె’ట పోటు.. రేప‌టి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు (జూడా) మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రభుత్వానికి నోటీసులు అందజేశారు

  • Publish Date - December 18, 2023 / 10:53 AM IST

  • తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు
  • స్టైఫండ్ బకాయిల కోసం పట్టు


విధాత: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు (జూడా) మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రభుత్వానికి నోటీసులు అందజేశారు. విధులకు హాజరుకాబోమని స్పష్టం చేశారు. జూడాల నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలగనుంది. ప్రభుత్వం మూడు నెలలుగా జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ అందజేయడంలో జాప్యం చేస్తోందని, తమ వినతులను ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం వల్లనే సమ్మెకు దిగాల్సి వచ్చిందని జూడాలు చెబుతున్నారు.


రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో దాదాపు 10 వేల మందికి పైగా వైద్య విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఇంటర్న్ షిప్ చేస్తున్న హౌస్ సర్జన్లు 2500 మంది, పీజీ స్పెషాలిటీ విద్యార్థులు 4 వేల మంది, సీనియర్ రెసిడెంట్లు 1500 మంది వరకు ఉంటారని వైద్య వర్గాల సమాచారం. రెండు, మూడో ఏడాది జూనియర్ రెసిడెంట్లు, హౌస్ సర్జన్లకు గత సెప్టెంబరు నెల నుంచి ప్రభుత్వం స్టైఫండ్ చెల్లించకుండా పెండింగ్ లో పెడుతూ, వైద్య సేవలను మాత్రం వినియోగించుకుంటున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది.



అదేవిధంగా మొదటి సంవత్సరం పోస్టు గ్రాడ్యుయేట్లు, సీనియర్ రెసిడెంట్లు కూడా బాధితులుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వ వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ కే రమేష్ రెడ్డికి ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. ఈక్రమంలోనే జూనియర్ డాక్టర్లు పలు దఫాలుగా డీఎంఈ కార్యాలయం, హెల్త్ సెక్రెటరీ, ఫైనాన్స్ సెక్రెటరీలతో పాలు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రికి కూడా వినతుల రూపంలో విన్నవించినా ఇప్పటివరకూ ఎలాంటి స్పందన లేదని జూడాలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చి జూడాల సమస్యలు పరిష్కరించాలని ఈనెల 19 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు హెచ్చరించారు.


ప్రభుత్వం జూడాల స్టైఫండ్ ను క్రమబద్ధీకరించి, ప్రతి నెలా నిర్ణయించిన తేదీల్లో తమ ఖాతాల్లో జమ చేయాలని, ఇందు కోసం ఆర్థిక శాఖలో పర్సన్ ఇన్ చార్జిని నియమించి, 24 గంటల్లో మెడికల్ బిల్లులు క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మెతో పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర ఆటంకం కలగనుంది. ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా రోగులకు వైద్య సేవలు కొనసాగేలా చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.

Latest News