కాంగ్రెస్‌లో చేరుతున్నా.. రాజ్యసభ సభ్యులు కేకే వెల్లడి

తాను బీఆరెస్‌కు రాజీనామా చేస్తూ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశానని, త్వరలోనే కాంగ్రెస్‌లో చేరబోతున్నానని రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు తెలిపారు

  • Publish Date - March 29, 2024 / 12:05 PM IST

  • రాష్ట్ర సాధనలో, పునర్ నిర్మాణంలో కేసీఆర్ పనితీరు విస్మరించలేం
  • ఆ ముగ్గురు ప్రతిభావంతులే


విధాత, హైదరాబాద్: తాను బీఆరెస్‌కు రాజీనామా చేస్తూ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశానని, త్వరలోనే కాంగ్రెస్‌లో చేరబోతున్నానని రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌, బీఆరెస్ పార్టీ తనను గొప్పగా గౌరవించిందని, అయితే బీఆరెస్‌ను కుటుంబమే నడిపిస్తుందనే భావన ప్రజల్లో ఉందని పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏం చేసినా క్యాడర్‌ను దూరం చేసుకోకూడదన్నారు. బీఆరెస్‌, కేసీఆర్ ఇచ్చిన గౌరవాన్ని మరిచిపోలేనన్నారు.


కొన్ని సరిచేసుకోవాల్సిన అంశాలను బీఆరెస్‌ సరిచేసుకోలేదన్నారు. 55ఏండ్లు నేను కాంగ్రెస్‌లో ఉన్నానని, ప్రస్తుతం నా వయసుకు 85ఏండ్లు నున్నానని, దేశంలో ఎవరికి ఇవ్వనన్ని పోస్టులు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం నాకు ఇచ్చిందని, సీడబ్ల్యుసీ మెంబర్‌గా, రెండుసార్లు ఎమ్మెల్సీ, మూడుసార్లు మంత్రిని, మండలి చైర్మన్‌గా, రాజ్యసభ సభ్యుడిని చేసి, నాలుగు స్టేట్‌లకు ఇంచార్చిలుగా అవకాశం ఇచ్చిందన్నారు. ఇందిరా హయాంలోనే ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా పనిచేశానన్నారు.


స్వతహాగా తెలంగాణ వాదినైనా నేను తెలంగాణ విషయంలో జరిగిన ఆలస్యంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే క్రమంలోఉద్యమ బలోపేతం కోసం బీఆరెస్ వైపు అడుగులేయాల్సివచ్చిందన్నారు. బీఆరెస్ ఏర్పాటుకు ముందే కాంగ్రెస్ పార్టీ లోని కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణను చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకుని 1998నుంచి మా ప్రయత్నాలు చేశామన్నారు. 42మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని సోనియాగాంధీకి లేఖ రాయడం జరిగిందన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు రాజీనామా చేశారని, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆమరణ దీక్షకు దిగారని గుర్తు చేశారు. ఆరు వర్కింగ్ కమిటీలు ఏర్పాటు అయ్యాయయని, వార్ గ్రూపులో తాను సభ్యుడిగా పనిచేశానన్నారు.


కాంగ్రెస్‌తో తన అనుబంధాన్ని కొనసాగించేందుకు, మిగతా నా జీవిత ప్రయాణాన్ని తన సొంత పార్టీలో కొనసాగించేందుకు తాను తిరిగి తన సొంతింటి వంటి కాంగ్రెస్‌లో చేరుతున్నానని, తుది శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానన్నారు. కేసీఆర్‌, కేటీఆర్, హరీశ్‌రావులు చాల ప్రతిభావంతులన్నారు. వారిని ఎవరు చాలెంజ్ చేయాలన్నారు. చేసే పనిలో వారు 24గంటలు నిబద్ధతతో పనిచేస్తారన్నారు. ఫ్లానింగ్ కమిషన్ చెప్పిన మేరకు దేశంలో వెనుకబడిన రాష్ట్రంంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని తలసారి ఆదాయం, జీడీపీ సహా ప్రగతి సూచీకలలో దేశంలో అగ్ర స్థానంలో నిలపడంలో, రాష్ట్రం పునర్ నిర్మాణంలో కేసీఆర్ చేసిన కృషి విస్మరించలేనిదన్నారు.

Latest News