విధాత,నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు శుక్రవారంతో గడువు ముగిసింది. 130 మంది అభ్యర్థులు 199 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఇందులో 47 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 83 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉండటంతో వాటిని పరిగణనలోకి తీసుకుని ఆమోదించారు.
ఇక నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 17. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. ప్రజాశాంతి పార్టీ తరపున వేసిన నామినేషన్ రిజెక్టు కాగా, ఇండిపెండెంట్‌గా వేసిన నామినేషన్ ఒకే అయినట్లు తెలుస్తోంది.
ఒక వేళ నా నామినేషన్ తిరస్కరిస్తే ఎన్నికనే జరగదు.. జరగనివ్వనని కేఏ పాల్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇతర పార్టీల నాయకులు ఒక వేళ పది తులాల బంగారం ఇచ్చినా, అది తీసుకొని ప్రజాశాంతి పార్టీకి ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు.
మునుగోడు నియోజకవర్గం ప్రజలు తమ తెలివితేటలను వాడి.. తనను గెలిపించాలని కోరారు. మునుగోడులో తనను గెలిపిస్తే ఉచిత వైద్యం, విద్య, ఉద్యోగ అవకాశాలు, రైతులకు రుణమాఫీ, మంచి నీటి వసతి, రోడ్లతో పాటు తదితర సౌకర్యాలన్ని ఆరు నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తానని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.