Site icon vidhaatha

Kamalakar | మంత్రి కమలాకర్‌ సార్‌.. ఏ క్యాహై..!

Kamalakar

తెలంగాణ ప్రభుత్వంలో ఆయన ఓ మంత్రి. రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన భూములున్న ప్రాంతంలో రూ.100 కోట్ల విలువైన ఓ భూమిపై ఆయన కన్ను పడింది. కానీ ఆ భూములపై క్రయవిక్రయాలు నిషేధంలో ఉన్నాయి. ఆ భూములపై కోర్టు డిక్రీలున్నా.. క్రయ విక్రయాలపై నిషేధమున్నా.. తహసీల్దార్‌ కార్యాలయానికి ఆ అమాత్యుడు రాకున్నా.. మంత్రి ముందు మోకరిల్లిన ధరణి రూ.100 కోట్ల భూములపై ఆ మంత్రికి హక్కులను ప్రసాదించింది. ఆ మంత్రి పేరు గంగుల కమలాకర్‌. మంత్రి పేర దర్జాగా రిజిస్ట్రేషన్‌ చేసింది రంగారెడ్డి జిల్లా గండిపేట మండల తహసీల్దార్‌. ఆ భూమి ఉన్నది గండిపేట మండలం వట్టినాగులపల్లి గ్రామ రెవెన్యూ పరిధి.

బూడిద సుధాకర్‌, విధాత, హైదరాబాద్‌ ప్రతినిధి:

గండిపేట మండలం వట్టినాగులపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 156/అ, 162/అ, 151/అ/1, 158/అ/1, 161/అ, 111/రు/2, 152/రు/2, 166/రు/2, 155/ఈ/2, 111/ఉ/2, 153/ఈ/2, 152/ఈ/2లోని భూములను ఓ వ్యక్తి గతంలో కొనుగోలు చేశారు. అనారోగ్య కారణాలతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో జాప్యం జరగడంతో కోర్టును ఆశ్రయించిన కొనుగోలుదారుడే నిజమైన హక్కుదారుగా కోర్టు నుంచి డిక్రీ పొందారు. అప్పటి నుంచి ఆ భూమి ఆయన ఆధీనంలోనే ఉంది. కానీ ఈ భూములపై క్రియేటివ్‌ డెవలపర్స్‌ అండ్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థతో పాటు మరికొన్ని రియల్‌ ఎస్టేట్‌ సంస్థల పేరిట సేల్‌డీడ్‌లు జరుగుతున్నట్లు గుర్తించి వెంటనే కోర్టును ఆశ్రయించారు.

ఆ భూములపై తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఎలాంటి క్రయవిక్రయాలు జరుగకుండా నిషేధం విధిస్తూ కోర్టు స్టే ఆర్డర్‌ జారీ చేసింది. దాని ప్రకారం వట్టినాగులపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 156/అ, 162/అ, 151/అ/1, 158/అ/1, 161/అ, 111/రు/2, 152/రు/2, 166/రు/2లలో ఉన్న భూములతో పాటు 155/ఈ/2, 111/ఉ/2, 153/ఈ/2, 152/ఈ/2లోని మొత్తం భూముల క్రయవిక్రయాలపై నిషేధం ఇప్పటికీ కొనసాగుతున్నది.

అమలు కాని నిషేధం.. ఆగని రిజిస్ట్రేషన్లు

నిషేధ జాబితాలో ఉన్నప్పటికీ సదరు సర్వే నంబర్లలోని భూములపై క్రియేటివ్‌ డెవలపర్స్‌ అండ్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ, క్రిస్టల్‌ డెవలపర్స్‌ అండ్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు సంబంధించిన వ్యక్తుల పేర రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీరి నుంచి సుమారు 3 ఎకరాల భూమిని గంగుల కమలాకర్ తనకు సంబంధించిన ఎస్‌ఎన్‌డీఎస్‌ హోమ్స్‌ అనే సంస్థ పేర 2022 మే 25న రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

ఇదే సర్వే నంబర్లలోని సుమారు 2 ఎకరాల భూమిని 2022 జూన్‌ 17న అదే సంస్థ పేరిట గంగుల రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయి, పట్టాదార్‌ పాస్‌ పుస్తకం జారీ అయిన వెంటనే ఆ భూములు ధరణిలో కనిపించకుండా ప్రైవసీలోకి వెళ్లిపోవడం గమనార్హం.

మంత్రి ఆదేశాలతో…

నిషేధ జాబితాలో ఉన్నప్పటికీ.. గండిపేట రెవెన్యూ యంత్రాంగం సదరు భూములను మంత్రి గంగుల కమలాకర్‌ పేరిట రిజిస్ట్రేషన్‌ చేశారు. పత్రాల్లోని ఫొటోలను గమనిస్తే.. రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో కాకుండా.. ఏదో ప్రైవేటు ప్రాంతంలో రిజిస్ట్రేషన్‌ జరిగినట్టు బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అలాగే వట్టినాగుల పల్లి భూములపై అనధికారికంగా కొందరికి వారసత్వ పత్రాలను జారీ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గంగుల రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న భూములతోపాటు.. గండిపేట మండల తహసీల్దార్‌ కార్యాలయం కేంద్రంగా జరుగుతున్న భూ యజ్ఞంపై సమగ్ర విచారణ చేయాలని బాధితులతోపాటు మండల రైతులు కోరుతున్నారు.

Exit mobile version