అంచనాలు పెంచిన భక్త కన్నప్ప ఫస్ట్ లుక్

మంచు విష్ణు జన్మదినం సందర్భంగా గురువారం ఆయన నటిస్తు నిర్మిస్తున్న భక్త కన్నప్ప నుంచి ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు. న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విష్ణు జన్మదినం పురస్కరించుకుని ఆ దేశం నుంచే విడుదల చేశారు

  • Publish Date - November 23, 2023 / 07:23 AM IST

విధాత : మంచు విష్ణు జన్మదినం సందర్భంగా గురువారం ఆయన నటిస్తు నిర్మిస్తున్న భక్త కన్నప్ప నుంచి ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు. న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విష్ణు జన్మదినం పురస్కరించుకుని ఆ దేశం నుంచే విడుదల చేశారు. పోస్టర్‌లో విష్ణు క‌న్న‌ప్ప వేషధార‌ణ‌లో త‌న పైకి ఆకాశం నుంచి దూసుకు వ‌స్తున్న బాణాలను చూస్తు విల్లును ఎక్కుపెట్టి బాణాలు వేస్తున్న‌ట్లుగా రూపొందించారు.


కొండల నడుమ పారుతున్న నదిని శివలింగంను తలపించేలా చూపించారు. ఫస్ట్‌లుక్ పోస్టర్ రూపకల్పన చేసిన తీరు చిత్రంపై అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్‌ బాబు పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌ తో, హై టెక్నికల్‌ స్టాండర్డ్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 80 శాతం న్యూజిలాండ్‌లోనే జరగనుంది.


శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమాకు ‘మహాభారత్‌’ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్ దర్శకత్వంలో రూపుదిద్దకుంటుంది. సీనియర్‌ రచయితలు పరుచూరి, బుర్ర సాయిమాధవ్‌, తోట ప్రసాద్ భక్తకన్నప్ప కథకు తుది మెరుగులు దిద్దారు. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంగీతం అందిస్తున్నారు. పలు భాషల సినిమా స్టార్స్‌ ఈ కన్నప్ప సినిమాలో నటిస్తుండటంతో పాన్ ఇండియా చిత్రంగా ప్రచారంలోకి వచ్చింది.


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శివుడిగా, న‌య‌న‌తార పార్వ‌తిగా న‌టిస్తుండ‌డంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, తమిళం నుంచి విలక్షణ నటుడు శరత్ కుమార్ వంటి వారంతా కన్నప్పలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.


హీరోయిన్‌గా నుపుర్ నసన్‌ను తొలుత ఎంపిక చేసినప్పటికి డేట్స్ కుదరక ఆమె చిత్రం నుంచి తప్పుకుంది. ఈ చిత్రంలో మోహన్ బాబు సైతం ఓ కీ రోల్‌ను పోషిస్తున్నారు. ‘బాహుబలి, జవాన్, పొన్నియిన్ సెల్వన్’ వంటి భారీ ప్రాజెక్టు‌లకు ఫైట్స్ కంపోజ్ చేసిన అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెచాతో పాటు థాయ్‌లాండ్, హాంకాంగ్ వంటి దేశాల నుంచి 80 మంది ఫైటర్లు ఈ సినిమా కోసం పనిచేయబోతున్నారని స‌మాచారం.

Latest News