Karnataka
విధాత: కర్ణాటక (Karnataka) లో ఘోరం వెలుగుచూసింది. తన దగ్గర పని చేస్తున్న వ్యక్తికి నిప్పు పెట్టి చంపడమే కాకుండా.. దానిని విద్యుదాఘాతంగా నమ్మించేందుకు ప్రయత్నించిన దుకాణ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు.
శనివారం వారు తెలిపిన వివరాల ప్రకారం.. కిరాణా స్టోర్ నడుపుతున్న తౌసిఫ్ హుసేన్ వద్ద గజ్నానా అనే వ్యక్తి పని చేసేవాడు. వారిద్దరి మధ్య చిన్న విషయమై వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో గజ్నానాపై ఆగ్రహంతో రగిలిపోయిన తౌసిఫ్.. అతడికి నిప్పు పెట్టి హత్య చేశాడు. అయితే అతడికి విద్యుత్ షాక్ తగిలిందని స్టోర్ చుట్టుపక్కల వారిని నమ్మించి చికిత్స కోసం అంటూ ఆ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించాడు.
అప్పటికే అతడు చనిపోవడంతో వైద్యులు అదే చెప్పారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులకు చాలా విషయాలు అనుమానంగా తోచాయి. చుట్టుపక్కల వారిని, మృతుడి బంధువులను విచారించి యజమానే నిందితుడని గుర్తించారు. శనివారం అతడిని అరెస్టు చేశారు.