విధాత, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కె.చంద్రశేఖర్ రావు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు. మాజీ మంత్రి టి. హరీష్ రావు, సికింద్రాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పద్మారావు, డీకే అరుణ కులగణన సర్వేలో పాల్గొనలేదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. తమ భూముల వివరాలు చెప్పాల్సి వస్తుందనే కెసిఆర్ కుటుంబం సర్వేలో పాల్గొనలేదన్నారు.
గతంలో బీఆరెస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే అధికారిక డాక్యుమెంట్ అయితే నివేదికను ఎందుకు కేబినెట్ లో పెట్టలేదు? ఆమోదించలేదని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో పెట్టకుండా ఆ నివేదికను ఒక కుటుంబం గుప్పిట్లో పెట్టుకుంది? అని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం సీట్లు బీసీలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. బీజేపీ, బీఆరెస్ లు సిద్ధమా? అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కులగణనలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో 3,54,77,554 మందిని సర్వే చేయడం జరిగింది. ఈ మొత్తంలో సామాజిక వర్గాల వారీగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది.
SCలో 61,84,319 మంది ఉండగా ఇది మొత్తంలో 17.43 శాతం గా ఉంది.
ST లో 37,05,929 ఉండగా ఇది మొత్తంలో 10.45 శాతం.
BC (ముస్లిం మైనారిటీ మినహా) లో 1,64,09,179 ఉండగా ఇది మొత్తంలో 46.25 శాతంగా ఉంది.
ముస్లిం మైనారిటీలలో మొత్తం 44,57,012 ఉండగా ఇది మొత్తంలో 12.56 శాతంగా ఉంది.
ముస్లిం మైనారిటీలో BC లు 35,76,588 ఉండగా, ఇది మొత్తంలో 10.08 శాతంగా ఉంది.
ముస్లీం మైనారిటీలో OCలు 8,80,424 ఉండగా ఇది మొత్తంలో 2.48 శాతంగా ఉంది.
OCలో 56,01,539 మంది ఉండగా ఇది మొత్తంలో 15.79 శాతంగా ఉంది.
OC లలో ముస్లీం మైనారిటీలు 8,80,424, ఇది మొత్తంలో 2.48 శాతంగా ఉంది.
ముస్లిం మైనారిటీ మినహా OCలు 47,21,115 ఉండగా ఇది మొత్తంలో 13.31 శాతంగా ఉంది.