విధాత: తెలంగాణ రాష్ట్రంలో ప్రజల నుంచి బీజేపీకి వస్తున్నఆదరణ సహించలేకనే సీఎం కేసీఆర్ ప్రభుత్వం బీజేపీ పార్టీ కార్యక్రమాలపై అణచివేత చర్యలకు దిగుతున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు. శుక్రవారం ఆయన నకిరేకల్ నియోజకవర్గం కట్టంగూర్, నార్కట్ పల్లిలో రైతులు, పార్టీ కార్యకర్తలతో జరిగిన ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని, అదే సమయంలో బీజేపీ బలపడుతుండటంతో జీర్ణించుకోలేని కేసీఆర్ ప్రభుత్వం బీజేపీ పాదయాత్రలపై అణిచివేత చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. షర్మిల పాదయాత్ర పై కూడా అప్రజాస్వామిక అణిచివేతకు కేసీఆర్ బరితెగించారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ పాలన అవినీతిమయంగా మారిపోగా, వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
ధరణితో రైతుల భూ సమస్యలు తగ్గకపోగా, పెరిగాయని, అలాగే అధికార పార్టీ వర్గాలకు భూమాఫియా సాగించేందుకు సాధనంగా మారిందన్నారు. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అంతా కేసీఆర్ డ్రామాగా పేర్కొన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేల కొనుగోలు చరిత్ర కేసీఆర్ కే ఉందన్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టు వ్యవహారం అంతా చట్టబద్ధంగా జరిగిందని, విపక్షాలు మునుగోడు ఎన్నికల్లో దుష్ప్రచారంతో రాజకీయ లబ్ధికి ప్రయత్నించడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.
Held a meeting in the Nakrekal Assembly constituency in Telangana, with the Incharges of @BJP4Telangana Shakti Kendras. Emphasised on strengthening the party, actively campaigning to propagate the benefits of @narendramodi Govt schemes. pic.twitter.com/LwZbe3RtmE
— Pralhad Joshi (@JoshiPralhad) December 2, 2022
రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు రిజర్వుడ్ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. హుజురాబాద్, దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయంతో పాటు మునుగోడులో గెలుపు అంచుల వరకు వచ్చిన బీజేపీ పట్ల ప్రజాధరణ స్పష్టమైందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్ల దేశ ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, దేశ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో మోడీ ప్రభుత్వం విజయవంతమయ్యారని తెలిపారు.
దేశ శాంతి భద్రతలను మెరుగుపరిచి అవినీతి రహిత పాలన సాగిస్తున్న మోడీ పట్ల ఉన్న ప్రజాధరణ వల్లే రాష్ట్రాల్లో బీజేపీ విజయాలకు దోహదం చేస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలో రావడానికి అవసరమైన మెజారిటీ సాధించడం తథ్యమన్నారు. ఈ విజయాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని ధీమా వ్యక్తం చేశారు.