Varalakshmi Sarathkumar |
ప్రముఖ తమిళనటి వరలక్ష్మి శరత్‌కుమార్ ఎన్‌ఐఏ కేరళ విభాగం అధికారులు సమన్లు జారీ చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ వార్త తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టించింది. ఓ డ్రగ్స్ కేసులో విచారణ కోసం ఆమెకు నోటీసులు వచ్చాయంటూ వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలపై వరలక్ష్మి స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
‘ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యం ఈ సమస్యపై స్పష్టత ఇవ్వడం ముఖ్యమని నేను భావించాను. ఎన్‌ఐఏ సమన్లు ఇచ్చిందని జరుగుతున్న ప్రచారం అవాస్తవం. అవన్నీ వట్టి పుకార్లు మాత్రమే. నాకు ఎలాంటి సమన్లు రాలేదు. వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించలేదు. నేను ఎక్కడికీ వెళ్లలేదు’ అంటూ క్లారిటీ ఇచ్చారు.
అయితే, ఈ నెల 18న కేరళలో ఓ ఫిషింగ్ బోటును ఎన్‌ఐఏ అధికారులు సీజ్ చేశారు. ఇందులో దాదాపు 300 కేజీల వరకు మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. బహిరంగ మార్కెట్‌లో దాని విలువ రూ.2100కోట్లు. దీనిపై కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, డ్రగ్స్ వ్యవహారంలో వరలక్ష్మి వద్ద గతంలో పని చేసిన మేనేజర్ ఆదిలింగం హస్తం ఉందని తెలుస్తున్నది.
ఆదిలింగంకు అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ క్రమంలోనే వరలక్ష్మికి సైతం నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ వ్యవహారంలో డ్రగ్స్ కేసులో మాజీ మేనేజర్ ఆదిలింగంతో పాటు తనపై వస్తున్న వరుస కథనాలపై వరలక్ష్మి స్పందిస్తూ.. ఆదిలింగం తనవద్ద మూడేళ్ల కిందట ఫ్రీలాన్స్ మేనేజర్‌గా పని చేశారని చెప్పింది.
ఆ సమయంలో వేరు ఫ్రీలాన్స్ మేనేజర్లతోనూ పని చేసినట్లు పేర్కొంది. ఆదిలింగంతో పని చేసింది కొద్దిరోజులేనని, అప్పటి నుంచి ఇప్పటి వరకు అతనితో మాటలు కూడా లేవని.. డ్రగ్స్ కేసులో వార్తల్లో తన పేరు రావడం చూసి షాకయ్యానంటూ వరలక్ష్మి పేర్కొన్నారు.
ప్రభుత్వానికి సహకరించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, సంతోషంగా సహకరిస్తానని చెప్పారు. నిజానిజాలు తెలుసుకోకుండా సెలబ్రిటీలపై ఇలాంటి వార్తలు రాయడం, కేసుల్లోకి వారిని లాగడం నిరాశ కలిగిస్తోందని వాపోయారు. ఇకపై అలాంటి వార్తలు ప్రచారం చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు.