Site icon vidhaatha

IAS Divya Iyer | ఆరేళ్ల వయసులోనే లైంగిక వేధింపులను ఎదుర్కొన్నా.. ఐఏఎస్‌ సంచలన వ్యాఖ్యలు..!

IAS Divya Iyer | చిన్నప్పటి నుంచే తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానంటూ కేరళ పతనంతిట్ట కలెక్టర్‌ దివ్య ఎస్‌ అయ్యర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరేళ్ల వయసులో ఇద్దరు వ్యక్తులు లైంగికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు మగవాళ్లు తనను ప్రేమగా పక్కన కూర్చోబెట్టుకొని బట్టలు విప్పారని షాకింగ్‌ కామెంట్‌ చేశారు. తొలుత వారు తనపై ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారో అర్థం కాలేదని, ఆ తర్వాత విషయం అర్థమై అక్కడి నుంచి పారిపోయానని పేర్కొన్నారు.

ఇలాంటి ఘటనల నుంచి తప్పించుకునే అదృష్టం పిల్లలందరికీ ఉండదన్నారు. తన తల్లిదండ్రుల సహయంతో ఈ ఘటన నుంచి బయటపడినట్లుగా వెల్లడించారు. ఆ ఘటనతో ఆ వయసులోనే తాను మానసిక క్షోభను అనుభవించానన్న దివ్య.. తల్లిదండ్రుల సహకారంతో ఆ బాధ నుంచి తాను బయటపడ్డానన్నారు. ఆ ఘటన తర్వాత వారు కనిపిస్తారేమోనని చూశానని, కనిపించలేదని.. అయితే, వారి ముఖాలు మాత్రం ఇప్పటికీ గుర్తున్నట్టు తెలిపారు. పిల్లలకు తల్లిదండ్రులు చిన్నప్పుడే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వివరించాలని పిలుపునిచ్చారు. చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపులపై అవగాహన కల్పించేందుకు జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

కాగా, దివ్య అరువిక్కర మాజీ ఎమ్మెల్యే కెఎస్ శబరినాధన్‌ను వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల తాము చిన్నప్పుడే లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లు ఇటీవల ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతిమలివాల్‌తోపాటు సినీ నటి ఖుష్బూ సుందర్‌ సైతం తాము సైతం చిన్నప్పటి నుంచి లైంగిక వేధింపుల బారినపడ్డట్లు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజా ఏఐఎస్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Exit mobile version