Site icon vidhaatha

Ponguleti | ఏ పార్టీలో చేరే విషయం.. ఈ నెలలోనే నిర్ణయం: పొంగులేటి, జూపల్లి

Khammam, Ponguleti

విధాత బ్యూరో, ఖమ్మం: రాత్రికి రాత్రే నిర్ణయాలు జరగవు.. తమ పార్టీలోకి రావాలని ఎవరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు.. ఏ పార్టీలో చేరాలన్న విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠతకు ఈ నెలలో తెరపడుతుందని.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivs Reddy) అన్నారు.

గురువారం బిజెపి చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఆ పార్టీ నేతలు రఘునందన్ రావు, కొండ విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి, జూపల్లి
మీడియాతో మాట్లాడారు.

బిజెపిలో చేరే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. చేరికల విషయమై తమ అనుచర వర్గంతో చర్చించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను వమ్ము చేసిన కేసీఆర్ ను గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం మరో ఉద్యమం చేసేందుకైనా సిద్ధమని ప్రకటించారు.

కెసిఆర్ ఖమ్మం నుండి ఎంపీగా పోటీ చేస్తే ఆయనపై పోటీకి సిద్ధమని పొంగులేటి ప్రకటించారు. ప్రజల ఆశలు, ఆలోచనలకు భిన్నంగా రాష్ట్రంలో పాలన సాగుతుందన్నారు. కెసిఆర్ ను గద్దెదించడానికి
వ్యతిరేక శక్తులు ఏకం కావలసిన అవసరం ఉందన్నారు. ఢిల్లీ పెద్దలు గతంలోనే బిజెపిలోకి
రావాలని ఆహ్వానించారని, తిరిగి వారి ఆదేశాల మేరకు ఆ పార్టీ నేతలు తమతో భేటీ అయ్యారని చెప్పారు.

ఈ భేటీలో పదవుల పంపకంపై చర్చలేవి జరగలేదన్నారు. ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలంటే ఒక మెట్టు దిగి రావడానికి అయినా సిద్ధమని చెప్పారు. తెలంగాణ విముక్తి కోసం అనేకమంది ప్రాణ‌త్యాగాలు చేస్తే, సాధించుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందన్నారు.

తమ సిద్ధాంతం ప్రజల కోసం పనిచేయడమే అని చెప్పారు. ప్రజలు తలుచుకుంటే పార్టీలు కాలగర్భంలో కలిసిపోతాయని అన్నారు. తమ ఎజెండా కెసిఆర్ ను ఇంటికి పంపడమే అని, తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసమే తాము పని చేస్తామన్నారు.

Exit mobile version