విధాత : టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన 35వ పుట్టిన రోజును ప్రత్యేకంగా జరుపుకున్నారు. వన్డే క్రికెట్ ఫార్మాట్‌లో సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును విరాట్ దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ లో సెంచరీ సాధించడం ద్వారా సమం చేశారు. దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 101 పరుగుల అజేయ శతకంతో సచిన్ రికార్డును సమం చేశాడు. మరో సెంచరీ సాధిస్తే కోహ్లీ సచిన్ రికార్డును అధిగమించి తన పేరిట కొత్త రికార్డును లిఖించుకోనున్నారు. కోహ్లీ 277 ఇన్నింగ్స్ ల్లోనే వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు. సచిన్ 452 ఇన్నింగ్స్ లో 49 శతకాలు చేశాడు. విరాట్ కోహ్లీ వన్డేలు టెస్టుల్లో కలిపి 79 సెంచరీలు చేశాడు. టెస్టుల్లో 29సెంచరీలు, టీ20ల్లో ఒక సెంచరీ చేశాడు. వన్డేల్లో కోహ్లీ 13,626 పరుగులు చేయగా, సచిన్ 18,426పరుగులు చేశారు. సచిన్ టెండూల్కర్ మొత్తం 100 సెంచరీలతో ముందు ఉన్నాడు. కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ 71 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 121 బంతుల్లో 10 ఫోర్లతోతో అజేయంగా 101 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ 87 బంతుల్లో 77 పరుగులు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ 22 పరుగులు, జడేజా 29 పరుగులు చేశారు. ఓపెనర్లు రోహిత్ శర్మ 40, శుభమన్‌గిల్ 23 పరుగులతో తొలి వికెట్‌కు 62 పరుగులు సాధించారు. మూడవ వికెట్ కు శ్రేయస్వి-విరాట్ కోహ్లీ 134 పరుగులు జోడించారు. కేఎల్ రాహుల్ 8 పరుగులకే అవుటయ్యారు. 327పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా 27.1ఓవర్లలో 83పరుగులకే అలౌట్ అయ్యి 243పరుగుల భారీ ఓటమి పాలయ్యింది. జడేజా ఐదు వికెట్లు తీశారు. కులదీప్, షమీ రెండేసి, సిరాజ్ ఒక వికెట్ తీశారు. ఈ వరల్డ్ కప్‌లో ఇండియా జట్టుకు ఇది వరుసగా ఎనిమిదో విజయం.