విధాత: మానవుడు ఇది వరకు ఎప్పుడూ కనుగొనని అతి పెద్ద బ్లాక్‌హోల్ (Black Hole)ను శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. నూతన విధానాల్లో పరిశీలిస్తుండగా సుదూర విశ్వంలో కాంతిని, గురుత్వాకర్షణ శక్తిని మింగేస్తూ ఈ భారీ ఆకృతి వారికి కనిపించింది.
మన సూర్యుడు లాంటి నక్షత్రాన్ని 30 బిలియన్‌లను ఒక తక్కెడలో వేస్తే ఎంత బరువుంటుందో ఈ కృష్ణ బిలం అంత బరువు, వైశాల్యంతో ఉందని తెలిపారు. ఈ ప్రత్యేకతే దీనిన భారీ కృష్ణబిలాల నుంచి వేరు చేసి అతి భారీ కృష్ణబిలాల జాబితాలో చేర్చిందని తెలిపారు. కొన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక గెలాక్సీ మధ్యలో ఈ బ్లాక్‌హోల్ ఉంది.
విచిత్రంగా శాస్త్రవేత్తలు ఒక పాలపుంత కోసం అన్వేషిస్తుండగా.. అనుకోకుండా దీని జాడ దొరికిందని పరిశోధనకు నేతృత్వం వహించిన యూకేలోని దుర్హామ్ యూనివర్సిటీ ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్ జేమ్స్ నైటింగేల్ వెల్లడించారు. తాము వెతుకుతున్న గెలాక్సీ దీని కంటే చాలా దూరంలో ఉంటుందని తెలిపారు. ‘తన వైపు వచ్చే కాంతిని బ్లాక్‌హోల్ లాగేసుకుంటుందని మనకి తెలుసు.
అందుకే దానిని సాధారణ టెలిస్కోప్‌తో చూడలేం. ఈ కృష్టబిలాన్ని కనుగొనడానికి మేము గ్రావిటేషనల్ లెన్సింగ్ అనే ప్రక్రియను ఉపయోగించాం. ఇంతటి భారీ బిలాల దగ్గర గురుత్వాకర్షణ వంపు తిరిగి ఉంటుంది. ఈ లక్షణం ఆధారంగానే లెన్సింగ్ పనిచేస్తుంది. అంతే కాకుండా ఇది ఎంతో దూరంగా వస్తువును కాస్త పెద్దదిగా చూపిస్తుంది’ అని నైటింగేల్ వెల్లడించారు.
ఈ అతి భారీ కృష్ణబిలాన్ని కనుగొనడంతో… మానవాళికి వాటి పరిమాణంపై ఉన్న అంచనాలు మారిపోనున్నాయని జేమ్స్ అభిప్రాయపడ్డారు. హబుల్ టెలిస్కోప్ సాయంతో తీసని లక్షల చిత్రాలను కంప్యూటర్ సిమ్యులేషన్‌లో జత చేసి ఈ బ్లాక్ హోల్‌కు ఒక రూపాన్ని తీసుకొచ్చామని ఆయన తెలిపారు. కాంతి వంపు పరిమాణాన్ని బట్టి దీని రూపాన్ని ఊహించామన్నారు.
అయితే ఎంత భారీ పరిమాణంలో ఉన్నప్పటికీ ఈ బ్లాక్‌హోల్ కాస్త నిస్తేజంగా ఉన్నట్లు అర్థమవుతోంది. తన లోపలికి ఏ పదార్థాన్నీ తీసుకోవట్లేదు. అదే విధంగా మిగతా కృష్ణబిలాల మాదిరి రేడియేషన్నూ వెలువరించడం లేదు. ఈ కారణాలతో దీని రూపాన్ని ఊహించడానికి అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టిందిస అని జేమ్స్ వెల్లడించారు.