విధాత: భారీ నక్షత్రం ఒకటి చనిపోయినప్పుడు కృష్ణ బిలం (Black Hole) ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే కనుగొన్న విషయం తెలిసిందే. అయితే దీనిని ఇప్పటి వరకూ ఒక సిద్ధాంత పరంగానే నిరూపించిన శాస్త్రవేత్తలు తొలిసారి ప్రత్యక్షంగా అటువంటి ఘటనకు సాక్షులుగా నిలిచారు. ఒక భారీ నక్షత్రం సూపర్‌నోవా (Supernova) గా మారి కృష్ణ బిలంగా మారిపోవడాన్ని రికార్డు చేసుకున్నారు. ఇలా మనం గమనిస్తున్నపుడు ఒక కృష్ణబిలం ఏర్పడటం ఖగోళ శాస్త్రం చరిత్రలో ఇదే తొలిసారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వెయిజ్‌మన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ లో ప్రొఫెసర్ పింగ్ చెన్ ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు. పరిశోధన వివరాలు నేచర్ జనరల్‌లో ప్రచురితమయ్యాయి. ముందుగా ఎస్ఎన్ 2022 జేఎల్ఐ అనే ప్రకాశవంతమైన వస్తువును శాస్త్రవేత్తలు గుర్తించి దానిని పరిశీలించడం ప్రారంభించారు. ఇది మన భూమికి సుమారు 76 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ ఖగోళ వస్తువును సౌతాఫ్రికాకు చెందిన ఆస్ట్రోనామర్ బెర్టో మొనార్డ్ తొలుత గుర్తించారు. అయితే కొన్ని రోజులు పరిశోధనలు చేసిన అనంతరం ఆ ప్రకాశించే వస్తువు ఒక సూపర్‌నోవా అని తేలింది.
సూర్యుడు లేదా అంతకంటే భారీ నక్షత్రం ఒకటి తన చివరి దశలో మరింత కాంతి వంతంగా మారుతుంది. ఆ దశలో దానిని సూపర్‌నోవా అంటారు. ఈ సూపర్‌నోవా క్రమంగా క్షీణించి ఒక కృష్ణ బిలంగా మారిపోతుంది. అయితే ఈ సూపర్‌నోవాను పరిశీలించడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే ఇది చాలా త్వరగా నాశనమైపోయి.. వెంటనే బ్లాక్‌హోల్‌గా మారిపోతుంది. ఇక్కడే ఎస్ఎన్ 2022 జేఎల్ఐ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. అది ఒకేసారి కాంతి విహీనంగా మారిపోయి కృష్ణబిలంలా మారకుండా.. వెలుగుతూ ఆరిపోతూ ఉన్న బల్బులా ప్రవర్తించి.. బ్లాక్‌హోల్‌లా మారింది. దీంతో సూపర్‌నోవా బ్లాక్‌హోల్‌లా మారే ప్రక్రియను శాస్త్రవేత్తలు గమనించగలిగారు.