విధాత: విశ్వం (Universe) నుంచి కొద్ది రోజులుగా మనకు అందుతున్న మిస్టీరియస్ రేడియో సిగ్నల్స్ (Radio Signals) ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా అవి మన పాలపుంత మధ్యలో ఉన్న ఒక బ్లాక్‌హోల్ (Black Hole) నుంచి వస్తున్నట్లు భావిస్తున్నారు. ద ఆస్ట్రోఫిజికల్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం వివరాల ప్రకారం.. ఓ మధ్యస్థాయి అంతరిక్ష వస్తువు నుంచి ఈ సిగ్నల్స్ వస్తున్నాయి. ఈ వస్తువు బ్లాక్‌హోల్ అయినా అయుండొచ్చు లేదా మరణానికి సిద్ధంగా ఉన్న నక్షత్రమైనా కావొచ్చు.
ఒక వేళ ఇది బ్లాక్‌హోల్ అయితే.. ఈ ప్రాంతంలో ఒక కృష్ణ బిలాన్ని కొనుగొనడం ఇదే తొలిసారి అవుతుంది. ఆస్ట్రేలియా కాంపాక్ట్ అరే (ఏటీసీఏ)కు 47 ట్యుకానే క్లస్టర్ నుంచి ఈ సిగ్నల్స్ వచ్చినట్లు ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ 47 ట్యుకానే క్లస్టర్ తరహా వాటిని గ్లోబ్యులర్ క్లస్టర్స్ అని పిలుస్తారు. వీటిలో 10 లక్షలకు పైగా నక్షత్రాలు తక్కువ చోటు లానే సర్దబడి ఉంటాయి. వీటి వ్యాసం 120 కాంతి సంవత్సరాలుగా ఉండి.. ధ్రువ ప్రాంతాల నుంచి సాధారణ కంటికి కనపడతాయి.
ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రానమీ రీసెర్చ్ (ఐసీఆర్ఏఆర్).. ట్యుకానే 47 నుంచి వస్తున్న రేడియో సిగ్నల్స్‌ను 450 గంటల పాటు ఏకబిగిన అధ్యయనం చేసి విస్పష్టమైన చిత్రాన్ని రూపొందించింది. అనంతరం దానిని విశ్లేషించగా క్లస్టర్ మధ్య భాగం నుంచి ఈ సిగ్నల్స్ వెలువడుతున్నట్లు అర్థమైంది. సూర్యునికి 14,500 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ క్లస్టర్‌లో బ్లాక్‌హోల్ లేదా.. పల్సర్ నక్షత్రం ఉండి ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఒకవేళ ఇది బ్లాక్‌హోల్ అయితే .. మన పాలపుంతలోని బ్లాక్‌హోల్ నుంచి వచ్చిన రేడియో సిగ్నల్స్‌ను తొలిసారి అధ్యయనం చేసినట్లు అవుతుంది. గ్లోబ్యులర్ క్లస్టర్‌ల మధ్యలో మధ్యస్థాయి బ్లాక్‌హోల్స్ ఉంటాయని సిద్ధాంతపరంగా నిరూపణ అయినప్పటికీ.. ఇప్పటికీ స్పష్టత లేదు అని అధ్యయనకర్త అలెగ్జాండ్రో పదౌనో వెల్లడించారు. గెలాక్సీల మధ్యలో ఉండే భారీ కృష్ణ బిలాలు కొన్ని కోట్ల సూర్యుళ్ల పరిమాణంలో ఉంటాయి. అంత భారీ పరిమాణం సంతరించుకోలోనివి.. మధ్యస్థాయి కృష్ణబిలాలుగా ఉండిపోతాయి అని ఆయన వివరించారు.