విధాత: అడవికి మృగరాజైన సింహం.. మహిళను చూసి భయపడటం ఏంటని అనుకుంటున్నారా..? ఇది నిజమే. జాగింగ్ చేస్తున్న ఓ మహిళను చూసి.. సింహం భయపడిపోయింది. చెట్ల పొదల వెనుక దాక్కుంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద మౌంటెయిన్ లయన్‌కు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. రోడ్డుపై ఓ మహిళ జాగింగ్ చేసుకుంటూ వెళ్తోంది. అప్పుడే అటు వైపు వచ్చిన మౌంటెయిన్ లయన్.. ఆ మహిళను చూసి భయపడింది. వెంటనే పక్కకు వెళ్లి.. పక్కనే ఉన్న చెట్ల పొదల్లో దాక్కుంది. జాగింగ్ చేస్తున్న మహిళ దూరంగా వెళ్లిపోయే వరకు ఆ సింహం వేచి చూసింది.
ఈ వీడియోకు సుశాంత క్యాప్షన్ ఇలా ఇచ్చారు. అడవి జంతువులు మనషులతో గొడవలకు చాలా దూరంగా ఉంటాయి. తమ ప్రాణాలకు ముప్పు అనిపించినప్పుడే దాడి చేస్తాయన్నారు. జాగింగ్ చేస్తున్న ఓ మహిళను చూసి మౌంటెయిన్ లయన్ ఎలా దాక్కుందో చూడండి అని పేర్కొన్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.