Margadarshi Chit Fund
విధాత: మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలను వెలికితీసి రామోజీరావును ఇరికించే విషయంలో జగన్ ప్రభుత్వం దూకుడు పెంచింది. మొన్నటి వరకూ అదనపు డిజి సంజయ్ సారథ్యంలోని సీఐడీ మార్గదర్శి చిట్ ఫండ్ లో జరిగిన అక్రమ లావాదేవీలను బయటికి లాగాయి.
బ్రాంచిల నుంచి డబ్బు కేంద్ర కార్యాలయానికి తెచ్చి అక్కడి నుంచి వేర్వేరు ఇతర వ్యాపారాలకు ఆ డబ్బును మళ్లించిన నేరానికి ఇప్పటికే రామోజీరావు ను ఏ -1 గాను ఎండి శైలజ ను ఏ – 2 గా పేర్కొంటూ కేసులు బుక్ చేసింది.
మొన్న మంగళగిరి సీఐడీ ఆఫీసుకు విచారణకు రావాలని నోటీసులు పంపగా వారిద్దరిలో ఎవరూ రాలేదు. అయితే గతంలో మార్గదర్శి విషయంలో సీఐడీ వారిద్దరినీ విచారించింది.. అంతే కాకుండా వెయ్యి కోట్లకు పైబడిన ఆస్తులను సైతం అటాచ్ చేసింది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఆ సంస్థలో రూ. కోటికి మించి డిపాజిట్ చేసిన వారి వివరాలు సేకరించిన సీఐడీ ఇపుడు వారిని సైతం విచారణకు పిలుస్తాం అంటోంది.
రూ.ఇరవై వేలకు మించి డిపాజిట్లు తీసుకోవడం నేరం కాగా ఈ సంస్థ ఏకంగా కోటి వరకూ డిపాజిట్లు సేకరించడం రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు ప్రకారం మహా నేరం అని సీఐడీ చెబుతోంది. ఈ క్రమంలోనే వారిని పిలిచి విచారిస్తాం అంటోంది.
మరోవైపు సీఐడీ చీఫ్ గా ప్రస్తుత ఇంటలిజెన్స్ బాస్ పి.సీతారామాంజనేయులుకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుత సీఐడీ చీఫ్ సంజయ్ సెలవు మీద వెళ్లడంతో సీతారామాంజనేయులు ఇప్పుడు కొత్తగా సీఐడీ చీఫ్ గా ఉంటారు. ఆయన ఇలాంటి కేసుల్లో చాలా దూకుడుగా ఉంటారని అంటారు.ఆయన మరి ఈ కేసును ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.