Chile Wildfire | దక్షిణ అమెరికా దేశమైన చిలీ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు తీవ్రరూపం దాల్చింది. ఫలితంగా అటవీ ప్రాంతమైంతా మంటలు విస్తరించాయి. ఇప్పటి వరకు దాదాపు 1,100 ఇండ్లు కాలి బూడిదయ్యాయి. మంటల్లో చిక్కుకొని 46 మంది దుర్మరణం చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం వాల్పరైసో ప్రాంతంలో పరిస్థితి ఘోరంగా ఉందని.. ఈ ప్రాంతానికి రెస్క్యూ బృందాలు సైతం చేరుకోలేకపోయాయని అధికారులు పేర్కొన్నారు. దేశంలోని మధ్య, దక్షిణ ప్రాంతాల్లో 92 అడవులు అగ్నికి ఆహుతయ్యాయని చిలీ అంతర్గత మంత్రి కరోలినా తోహా తెలిపారు. 43వేల హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ప్రభావితమైందని పేర్కొన్నారు. జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో మంటలు చెలరేగుతుండడమే తమకు పెద్ద ఆందోళన అని పేర్కొన్నారు. మంటలకు ఇండ్లు సైతం అంటుకొని కాలిబూడిదవుతుండడంతో నివాసంతో పాటు ఇతర సౌకర్యాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చిలీలో వేసవి సమయంలో అడవుల్లో అగ్నికీలలు ఎగిసిపడడం సాధారణం. గత సంవత్సరం రికార్డు వేడి సమయంలో చెలరేగిన అగ్నిప్రమాదంలో 27 మంది మరణించారు. 4లక్షల హెక్టార్లకుపైగా ప్రాంతం ప్రభావితమైంది.
గతేడాది కంటే ఈ సారి అగ్ని ప్రమాదం తీవ్రత తక్కువగానే ఉందని.. అగ్నికీలలు వేగంగా వ్యాపిస్తున్నాయని హోంమంత్రి పేర్కొన్నారు. తీరప్రాంత రిసార్ట్ పట్టణం వినా డెల్ మార్‌కు మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని.. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని చెప్పారు. ఇదిలా ఉండగా.. నగరంలోని కొండ ప్రాంతమైన విల్లా ఇండిపెండెనియాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వందలాది గృహాలు, వ్యాపార సముదాయాలు ధ్వంసమయ్యాయి. వీధుల్లో ఉన్న కారు కాలిపోయాయి. స్థానికుడు ఒకరు మాట్లాడుతునూ తాను 32 సంవత్సరాలుగా స్థానికంగా ఉంటున్నానని.. ఇక్కడ ఇలా మంటలు అంటుకుంటాయని ఎప్పుడూ భావవించలేదని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం సమీపంలోని కొండపై మంటలు చెలరేగడం తాను చూశానని.. ఆ తర్వాత 15 నిమిషాల్లోనే ఈ ప్రాంతంలో మంటలు, పొగతో నిండిందని సదరు వ్యక్తి వివరించారు. మంటలతో తమను తాము కాపాడుకునేందుకు అందరూ పరుగులు తీయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు.