MEDAK | CM KCR .. భూములమ్మి రుణమాఫీ: ఈటల

CM KCR | MEDAK మెదక్ గడ్డ నుంచే యుద్ధం మొదలైంది డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వడంలో కేసీఆర్ సర్కార్ విఫలం సదువుకున్నోళ్లకు నౌకర్లు రావు… పైరవీకారులకే వస్తాయి… లిక్కర్ సేల్స్ లో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ తొమ్మిదేళ్లలో ఒక్కరేషన్ కార్డు ఇవ్వలేదు దళితులందరికి దళిత బంధు ఇచ్చేదమ్ము కేసీఆర్ కు ఉందా ? బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: హైద్రాబాద్‌లోని విలువైన భూములు అమ్మి వచ్చిన […]

  • Publish Date - August 10, 2023 / 03:03 PM IST

CM KCR | MEDAK

  • మెదక్ గడ్డ నుంచే యుద్ధం మొదలైంది
  • డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వడంలో కేసీఆర్ సర్కార్ విఫలం
  • సదువుకున్నోళ్లకు నౌకర్లు రావు… పైరవీకారులకే వస్తాయి…
  • లిక్కర్ సేల్స్ లో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్
  • తొమ్మిదేళ్లలో ఒక్కరేషన్ కార్డు ఇవ్వలేదు
  • దళితులందరికి దళిత బంధు ఇచ్చేదమ్ము కేసీఆర్ కు ఉందా ?
  • బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: హైద్రాబాద్‌లోని విలువైన భూములు అమ్మి వచ్చిన సొమ్ముతో రైతుల ఖాతాలలో రుణమాఫీ డబ్బులు వేస్తున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆస్తులను వేలం పెడుతున్నారని మాజీ మంత్రి, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ అన్నారు.

తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన మెతుకుసీమ చైతన్యవంతమైన మెదక్ గడ్డ నుంచే తెలంగాణ సర్కార్ పై యుద్ధం మొదలైందన్నారు. పేదలందరికి డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మెదక్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాందాస్ చౌరస్తా లో ఏర్పాటు చేసిన సభలో నిజాంపేట బీఆరెస్ జడ్పిటీసీ పంజా విజయ్ కుమార్ ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీ లో చేరారు.

ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వడంలో తెలంగాణ సర్కార్ పూర్తిగా విఫలమైందని, సీఎం కేసీఆర్ మాత్రం ఆరునెలల్లో రూ 100 కోట్లు కేటాయించి 100 రూముల విలాసవంతమైన బంగ్లా కట్టుకొని ఉంటున్నారని విమర్శించారు. భూములు అమ్మి రాష్ట్రాన్ని నడిపిస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని విమర్శించారు. భూములమ్మి రైతు బంధు ఇచ్చిన కేసిఆర్.. రుణ మాఫీ కోసం కోకాపేట్ భూములను అమ్మారని హేళన చేశారు.

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటున్న కేసిఆర్(CM KCR) తెలంగాణ సంపదను తీసుకుపోయి పంజాబ్ , హర్యానా రాష్ట్రాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతులకు పంచాడని ఈటల ధ్వజమెత్తారు. లిక్కర్ బిజినెస్ లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు రూ.10,700 కోట్లు మద్యం ద్వారా ఆదాయం వస్తే.. ప్రస్తుతం 45 వేల కోట్లు మద్యం పై ఆదాయం వస్తుందన్నారు.

ప్రజా వ్యతిరేక పాలనను సాగిస్తున్న సీఎం కేసీఆర్ పై సొంత జిల్లా మెదక్ నుంచే యుద్ధం మొదలైందని ఆయన హెచ్చరించారు . కేసీఆర్ ను హెచ్చరించడానికే మెదక్ వచ్చానన్నారు. అర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్ళను ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా దళితులందరికి దళిత బంధు ఇచ్చే దమ్ముందా అని సవాల్ చేశారు.

ప్రజా సమస్యలను చర్చిoచే అవకాశం లేకుండా అసెంబ్లీని కేవలం నాలుగు రోజులు మాత్రమే నడిపించారని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆ నాలుగు రోజుల్లో కూడా ప్రతిపక్షాల పై కేటీఆర్, హరీశ్ రావు , కేసీఆర్ లు దాడులు చేయడానికే సరిపోయిందన్నారు. ఈ నేతలందరూ ఉమ్మడి మెదక్ జిల్లా వారేనన్నారు. ఇలాంటి నేతలను గెలిపించి తెలంగాణ ప్రజలపై దాడి చేసే అవకాశం ఇచ్చారన్నారు.

మీ ఆశీర్వాదం ఉంటే రేపు మేము కూడా వారి పై దాడి చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో సంపదకు కొదవ లేదని , దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పే ముఖ్యమంత్రి అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదని ఈటల ప్రశ్నిoచారు. 9 ఏళ్ళలో రూ.20 లక్షల కోట్లు బడ్జెట్‌లో పెడితే , డబుల్ బెడ్ రూం ఇళ్ళ కోసం ఖర్చు చేసింది మాత్రం రూ.560 కోట్లని విమర్శించారు.

ఇళ్ల నిర్మాణం కోసం హడ్కో నుంచి రుణం రూ.8,609 కోట్లు , కేంద్ర ప్రభుత్వo అర్బన్, రూరల్ హౌజింగ్ స్కీం కింద ఇచ్చిన రూ.1,160 కోట్లు , 9 ఏళ్ళ బడ్జెట్ లో కేటాయించిన 11వేల కోట్లు ఏమయ్యాయని ఈటల ప్రశ్నించారు. ఇప్పటి వరకు పేదలకు పంచిన డబుల్ బెడ్ రూం ఇళ్లు కేవలం 35 వేలు మాత్రమేనన్నారు. అవి కూడా సిద్ధిపేట , సిరిసిల్ల , గజ్వేల్ నియోజవర్గాల్లోనే పంచారని ఆరోపించారు.

డబుల్ బెడ్ రూం ఇంటికి రూ. 5లక్షలు ఇస్తామన్న ముఖ్యమంత్రి ఇప్పుడు రూ.3 లక్షలకు కుదించాడని ధ్వజమెత్తారు. మూడు లక్షలతో ఇంటి నిర్మాణo ఎలా అవుతుందని సీఎంను ప్రశ్నించారు. గృహలక్ష్మీ కింద అర్హులందరికీ రూ.5 లక్షలు ఇవ్వాలని ఈటల డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సదువుకున్నోళ్లకు నౌకర్లు రావని, పైరవీ కారులకు మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయన్నారు.

టిఎస్పీఎస్సి లో అన్ని అక్రమాలేనని, లీకేజీలతో వ్యవస్థను సర్వనాశనం చేశారన్నారు. రైతుల పట్ల తెలంగాణ సర్కార్ కు చిత్తశుద్ధి లేదన్నారు. అతివృష్టి ,అనావృష్టి వల్ల పంటలు నష్టపోయిన రైతాంగానికి ఏఒక్క రూపాయి పరిహారం అందలేదన్నారు. తెలంగాణ లో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.ఈ సభలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Latest News