Medak | వడగండ్ల వాన.. వేల ఎకరాల్లో పంట నష్టం! రైత‌న్న‌కు తీర‌ని క‌ష్టం

Medak అధికారుల ప్రాథమిక అంచనా పండ్లతోటలు.. కూరగాయలు, పత్తి పంట‌లకు నష్టం నేలకొరిగిన వరి.. రాలిన మామిడి చేతి కొచ్చిన పంట నేల పాలు.. రైతన్న అప్పుల పాలు విధాత‌, మెద‌క్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి: మెదక్(Medak) ఉమ్మడి జిల్లాలో కురిసిన వడగండ్ల వానతో రైతులకు అపార నష్టం సంభవించింది. చెడు వాన‌లతో చేతికొచ్చిన పంట నేల పాలైంది. ఉమ్మడి జిల్లాలో కురిసిన వడగండ్ల వాన… రైతులకు కడగండ్లు మిగిల్చింది. వేలాది ఎకరాల్లో పంటలు నీటి పాలయ్యాయి. కోతకొచ్చిన […]

  • Publish Date - April 26, 2023 / 11:55 AM IST

Medak

  • అధికారుల ప్రాథమిక అంచనా
  • పండ్లతోటలు.. కూరగాయలు, పత్తి పంట‌లకు నష్టం
  • నేలకొరిగిన వరి.. రాలిన మామిడి
  • చేతి కొచ్చిన పంట నేల పాలు.. రైతన్న అప్పుల పాలు

విధాత‌, మెద‌క్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి: మెదక్(Medak) ఉమ్మడి జిల్లాలో కురిసిన వడగండ్ల వానతో రైతులకు అపార నష్టం సంభవించింది. చెడు వాన‌లతో చేతికొచ్చిన పంట నేల పాలైంది. ఉమ్మడి జిల్లాలో కురిసిన వడగండ్ల వాన… రైతులకు కడగండ్లు మిగిల్చింది. వేలాది ఎకరాల్లో పంటలు నీటి పాలయ్యాయి. కోతకొచ్చిన వరి, మామిడి లాంటి పంటలు దెబ్బతిన్నాయి.

వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పగలంతా భరించలేని ఎండలు. సాయంకాలం ఊహించని వర్షాలు. వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా చల్లబడి విచిత్ర పరిస్థితి నెలకొంటోంది. అంతేకాదు.. ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. వడగండ్లు పడుతున్నాయి. అయితే తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చుతున్నాయి.

కాలం కాని కాలంలో కురిసిన వర్షాలకు కంది, మామిడి, పెసర, పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. చేతికి వచ్చిన పంట కళ్లముందే వర్షార్పణం కావడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మెద‌క్‌, సిద్దిపేట‌, సంగారెడ్డి జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు పంట నష్టాన్ని అంచనా వేయాలని… ప్రభుత్వ యంత్రాంగం క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది.

అనేక ఒడిదుడుకులను అధిగమిస్తూ, ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి పంటలు సాగు చేస్తున్న జిల్లా రైతాంగానికి ప్రకృతి సహకరించక తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం అనేక మండలాల్లో బీభత్సమే సృష్టించింది.

వర్షానికి తోడు వడగండ్లు కురియడంతో పంటలకు అపార నష్టం వాటిల్లింది. వడగళ్ల ధాటికి వేలాది ఎకరాల విస్తీర్ణంలో సాగైన పంట‌లు తడిసి ముద్దయ్యాయి. అసలే దిగుబడులు అంతంతమాత్రంగానే చేతికంది, ప్రస్తుతం వ్యాపారుల మార్కెట్ మాయాజాలం వల్ల మద్దతు ధరలు గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో వరుణుడు అకాల వర్షం రూపంలో రైతన్నను మరింతగా కుంగదీశాడు.

వరి పంటతో పాటు మామిడి, ఇతర పంటలన్నింటిని అకాల వర్షం దెబ్బతీసింది. జిల్లా పరిధిలో సుమారు 30 నుండి 35 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్న ప్రాథమిక అంచనా వేశారు. ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. సిద్దిపేట జిల్లాలో 36 వేల ఏకరాలలో వరి పంట నష్టం జరిగిందనీ మంత్రి హరీష్ రావు స్వయంగా సిద్దిపేట లో ప్రకటించారు. సంగారెడ్డిలో కేవలం 250 ఏకారాల్లో పంట నష్టం జరిగిందనీ సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సింహా రావు విధాత ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు.

అధిక విస్తీర్ణంలో వేసిన ఆరుతడి పంటలకు నష్టం వాటిల్లింది. ఏమాత్రం ఊహించని రీతిలో కురిసిన అకాల వర్షం తమ ఆశలను ఆవిరిచేసిందని బాధిత రైతులు కంటతడి పెడుతున్నారు. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు తడిసి ముద్దవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

భారీ నష్టం

పలుచోట్ల కురిసిన అకాల వర్షాలకు మామిడి పంటకు భారీ నష్టం కలిగింది. వరి, మిర్చి పంటలు తడిసి పనికిరాకుండా పోయాయి. ఉమ్మడి జిల్లాలోని దాదాపు రెండు వందల ఎకరాల్లో మామిడిపంట దెబ్బతింది. ఉమ్మ‌డి జిల్లాలో మెద‌క్‌, సిద్దిపేట‌, అరటి తోటల్లో గెలలు రాలిపడ్డాయి.

మిర్చిపంటకు తీవ్రనష్టం వాటిల్లింది. కల్లాల్లోని వరి ధాన్యం నీటి పాలైంది. సిద్దిపేట జిల్లాలో.. 35 వేల నుండి 45 వేల ఎకరాల్లో వరి పంట లు దెబ్బతిన్నాయి. మొక్కజొన్న, .మిర్చి, మామిడి తోట, కూరగాయల పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లింది.

చేతికొచ్చిన పంట నీళ్ల పాలు..

యాసంగి పంటలన్నీ కోత దశలో ఉన్నాయి. ఈ టైమ్‌లో వర్షాలు కురవడంతో చేతికొచ్చిన పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. వరి, మక్క, మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే కోతలు మొదలు కాగా, ఆలస్యంగా వేసిన మరికొన్ని జిల్లాల్లో వరి, మక్క చేన్లు నేలవాలాయి.

జిల్లాల్లో వరి పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసిన రైతులు రాత్రింబవళ్లు అక్కడే ఉంటున్నారు. వర్షాలకు ధాన్యాన్ని కాపాడుకోవడానికి కాపలా కాస్తున్నారు. ఐనప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకంకు తెచ్చిన వరి ధాన్యం తడిసిపోయింది.

కొన్ని రోజులుగా ఈదురుగాలులు, వడగండ్ల వర్షాలు పడుతుండడం.. కొనుగోలు సెంటర్లలో ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో వడ్ల కుప్పలు, బస్తాలు తడిసిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తడిసిన ధాన్యం ఆరబెట్టుకోవడానికి డ్రయర్లు లేక తిప్పలు పడుతున్నారు.

అధైర్య‌ప‌డోద్దు.. ఆదుకుంటాం: మంత్రి హ‌రీష్‌రావు

పంట నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని.. మంత్రి హరీష్ రావు ధైర్యం చెప్పారు. వర్షాభావంతో నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి.. నష్టపరిహారం అందేలా చూస్తామని చెప్పారు. నష్టపోయిన ధాన్యం పంటల వివరాలు యుద్ధప్రాతిపదికన సేకరించాలని మంత్రి హరీశ్ రావు జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

4 ఏకరాల్లో వరి వేస్తే మొత్తం నేల పాలు:

4 ఏకారాల్లో పంట వెస్తే మొత్తం వర్షానికి నేల పాలైంద‌ని నిజాంపేట్ మండలం నందిగామ గ్రామానికి చెందిన రైతు కన్నీటి పర్యంతం అయ్యారు.పెట్టిన పెట్టుబడి.. నీటిలో కలిసిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కౌలుకు తీసుకొని పంట సాగుచేశానని నందిగామకు చెందిన పున్న వెంకట స్వామి అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. – కౌలు రైతు పున్నా వెంకట స్వామి

5 ఎకరాల్లో పట నష్టం: యాడారం హ‌ర్ష‌ గౌడ్

నిజాంపేట్ మండలం లోని నస్కల్ గ్రామానికి చెందిన యాదరం హ‌ర్ష‌గౌడ్ 7 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. వడగండ్ల వానతో 5 ఎకరాల్లోని పంట నీటరాలిందని హర్ష గౌడ్ కన్నీటి పర్యంతమయ్యారు… ప్రభుత్వం నష్టపోయిన పంటకు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన కోరారు.

Latest News