Telangana | ఐదు ఎకరాల వరకే రైతు భరోసా.. రెండు విడతల్లో రుణమాఫీ

రేపు జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో రైతు రుణ మాఫీ, రైతు భరోసా కు సంబంధించి విధి విధానాలు, మార్గదర్శకాలకు ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి

  • Publish Date - June 20, 2024 / 10:09 AM IST

విధాత‌: రేపు జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో రైతు రుణ మాఫీ, రైతు భరోసా కు సంబంధించి విధి విధానాలు, మార్గదర్శకాలకు ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండింటికి కేంద్ర కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకానికి రూపొందించిన మార్గదర్శకాలనే ప్రామాణికంగా తీసుకోవాలని సర్కార్ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. రైతు భరోసా కింద ఇచ్చే నగదు ఐదెకరాల పరిమితం చేయనన్నుట్టు సమాచారం. గత ప్రభుత్వం రైతు బంధు కింద ఇచ్చే నగదు ను పరిమితి పెట్టాలని రైతులతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన వారూ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

దీన్ని ప్రభుత్వం పరిగణన లోకి తీసుకొనున్నది. అలాగే ఆగస్టు 15 లోగా రెండు లక్షల రుణ మాఫీ హామీ ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశం తో ఈ ప్రక్రియను జులై మొదటి వారం నుంచి ఆగస్టు 15 వరకు రెండు దశల్లో పూర్తి చేయాలని యోచిస్తున్నది. తొలుత రూ. లక్ష తర్వాత రూ. లక్షన్నర వరకు రుణాలను మాఫీ చేయనున్నది. అనంతరం రెండు లక్షలు తీసుకున్న వారి రుణాలు రెండు విడతల్లో మాఫీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చింది. వీటిపై మంత్రి వర్గ భేటీలో తుది నిర్ణయం తీసుకొనున్నది.

రాష్ట్రంలో వచ్చే మొదటి వారం నుంచి ఆగస్టు 15 వరకు దశలవారీగా రుణమాఫీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అమలు కోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం నిధుల సమీకరణ, మార్గదర్శకాల వంటి అంశాలపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మొదట రూ. లక్ష వరకు తర్వాత రూ. లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేసిన అనంతరం రెండు లక్షల అప్పు ఉన్న వారికి రెండు విడతల్లో మాఫీ చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ రెండు దశల్లో సుమారు 16 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ అమలవుతుందని అంచనా.

జులైలో కంద్రం ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రుణమాఫీ అమలుకు నిధులను సమీకరించే అవకాశం ఉన్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. రుణమాఫీకి అర్హతే ప్రధాన అజెండాగా ఈ నెల 21న మంత్రివర్గ సమావేశం జరగనున్నది. రుణమాఫీకి సుమారు రూ. 30 వేల కోట్లు అవసరమని ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. అందుకు నిధుల సేకరణ, విధివిధానాల రూపకల్పనపై క్యాబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నది. ఆదాయ పన్ను చెల్లించే వారికి రుణమాఫీ వర్తింప జేయాలా లేదా అన్నది చర్చించనున్నది.

రైతు భరోసాకు సంబంధించిన మార్గదర్శకాలనపైనా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్చించి ఒక నిర్ణయానికి వచ్చింది. గుట్టలు, కొండలు, రియల్‌ ఎస్టేట్‌ లేఔట్ల వంటివన్నీ మినహాయించనున్నారు. సాగు చేసే రైతుకు మాత్రమే రైతు భరోసా దక్కాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని, దీనికి అనుగుణంగా మార్గదర్శకాలు ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్నిఎకరాల భూమి ఉన్నా ఒక రైతు 5 ఎకరాలకుమాత్రమే రైతు భరోసా పరిమితం చేయనున్నట్టు తెలిసింది.

ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి కొన్నిరోజులుగా ఆర్థికశాఖ అధికారుల, మంత్రివర్గ సహచరులతో ఈ ఈఅంశంపై విస్తృతంగా చర్చిస్తున్నారు. కేంద్ర కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకానికి రూపొందించిన మార్గదర్శకాలను అధ్యయనం చేసిన ప్రభుత్వం రుణమాఫీ కోసం కేంద్రం మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోనుట్టు సమాచారం.

సంస్థలకు ఉన్న భూములకు, కేంద్ర, రాష్ట్ర, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి, ప్రస్తుత మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, చార్టెడ్‌ అకౌంటెట్లు ఇలా పలు రంగాలకు చెందిన వారు భూముల పై తీసుకున్న రుణాలకు మాఫీ ఉండదు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత సుమారు 26 లక్షల కుటుంబాలకు రుణమాఫీ అమలు చేసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

Latest News