– 8 గేట్లు ఎత్తి నదిలోకి నీటి విడుదల
– ఆందోళనలో సమీప గ్రామాల ప్రజలు
– బ్యారేజీ మీదుగా రాకపోకలు బంద్
– సిరోంచ మీదుగా ట్రాఫిక్ మళ్లింపు
– మసకబారుతున్న కాళేశ్వరం
విధాత, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు మసకబారి పోతోంది. సాంకేతిక సమస్యలతో తరచూ ప్రభుత్వానికి సమస్యలు సృష్టిస్తోంది. ఈ ప్రాజెక్టులో అత్యంత ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో సమీప గ్రామాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బ్యారేజీకి సంబంధించి 6వ బ్లాక్ లోని 15వ పిల్లర్ నుండి 22వ పిల్లర్ వరకూ కుంగిపోవడంతో నీటి పారుదల శాఖ అధికారులు ప్రాజెక్టులోని నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీకి మొత్తం 85 క్రస్ట్ గేట్లు ఉండగా, ఇందులో 16.17 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు.
ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ బ్యారేజీ కుంగి పోవడం సంచలనంగా మారింది. బ్యారేజీ కుంగిపోయిన విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఆ ప్రాంతానికి పోలీసు బలగాలను తరలించారు. మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా వాహన రాకపోకలు నిలిపేసి, ఇతర మార్గాల వైపు మళ్లించారు. దీంతో బ్యారేజీ ప్రమాదకర స్థాయికి చేరుకుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం సాయంత్రం వరకు ఈ మార్గంలో రాకపోకలకు అనుమతించిన నీటి పారుదల శాఖ అధికారులు, రాత్రి బ్యారేజీకి ఇరువైపులా రోడ్డు స్టాపర్లను ఏర్పాటు చేశారు. వాహనాలన్నింటినీ కాళేశ్వరం, సిరోంచ మీదుగా మళ్లిస్తున్నారు.
ఇదివరకే కూలిన లక్ష్మీ పంప్ హౌస్ గోడలు
కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులో అత్యంత ప్రధానమైన లక్ష్మీ ( కన్నెపల్లి ) పంప్ హౌస్ కొంత కాలం క్రితం గోడలు కూలిపోవడంతో ప్రమాదంలో పడింది. ఈ పంపు హౌస్ నుంచి 3 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి 17 బాహుబలి మోటార్లను ఏర్పాటు చేశారు. భారీ వరద నీటితో గోడలు కూలి మోటార్లలోకి నీరు చేరడంతో 12 మోటార్లు పూర్తిగా పనికి రాకుండా పోయాయి. ఇప్పటి వరకూ వీటిని మరమ్మతు చేయడానికి సాంకేతిక నిపుణులు రాలేదు. ఈ పంపు హౌస్ లో మరో మూడు, నాలుగు మోటార్లు మాత్రమే పని చేసే పరిస్థితుల్లో ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ తరచూ ప్రమాదాల అంచున చేరుతోంది. ఈ పరిణామం కాళేశ్వరం ప్రాజెక్టులోని సాంకేతిక డొల్లతనాన్ని బయటపెడుతోంది.