Site icon vidhaatha

Minister Jagadish Reddy | పండుగలా.. కోటి వృక్షార్చన: మంత్రి జగదీష్ రెడ్డి

Minister Jagadish Reddy

విధాత : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రం లోని నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయం ఆవరణ కోటి వృక్షార్చన కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి శ్రీకారం చుట్టారు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ హరితహారంలో భాగంగా చేపట్టిన కోటి వృక్షార్చ‌న కార్యక్రమం అద్భుతమైనదని కొనియాడారు.

ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. హరితహారం వల్లే వాతావరణ సమతుల్యం ఏర్పడిందన్న మంత్రి, సకాలంలో వర్షాలు పడుతుండ‌టంతో ప్రజలు పాడిపంటలతో సంతోషంగా ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు చుక్క నీరు లేని పరిస్థితుల నుంచి, నీరు ఇక చాలు అనే స్థాయికి వ‌చ్చాంమంటే ఇదంతా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యం అయిందన్నారు.

హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో 7.7 శాతం గ్రీనరీ పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని మంత్రి జగదీశ్‌ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెనుమాల అన్నపూర్ణమ్మ, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, గుర్రం సత్యనారాయణరెడ్డి, మునిసిపల్ కోఆప్షన్ స్వరూప , మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version