Site icon vidhaatha

Minister KTR | భారీ వర్ష సూచన.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి కేటీఆర్

Minister KTR

విధాత, హైద‌రాబాద్: రానున్న రోజుల్లో భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో గ్రేటర్ సిటీ పరిధిలో అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఎంతటి భారీ వర్షం వచ్చినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రథమ కర్తవ్యం గా పనిచేయాలని ఆదేశించారు. ఇక విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినమైన చర్యలు తప్పవని ఆదేశించారు. వాతావరణ శాఖ భారీ వర్ష సూఛనల నేపధ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులతో బుధవారం వర్షాలు, పారిశుద్ధ్యంపై కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.

రానున్న రెండు మూడు రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవసరం ఉన్నదని, ఈ సందర్భంగా నగరపాలక సంస్థ ఇతర శాఖలన్నింటితో సమన్వయం చేసుకొని సిద్ధంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా జలమండలి, విద్యుత్ శాఖ, హైదరాబాద్ రెవెన్యూ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీస్ వంటి కీలకమైన విభాగాలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. సిటీలో పారిశుద్ధ్య నిర్వహణ గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎన్నో మెరుగైందని, అయితే దీంతోనే సంతృప్తి చెందకుండా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

హైదరాబాద్ నగరం వేగంగా విస్తరించడం, జనాభా పెరగడం వంటి అంశాల వలన నగరంలో చెత్త ఉత్పత్తి పెరుగుతున్నదని, ఈ మేరకు పారిశుధ్య నిర్వహణ ప్రణాళికలను సైతం ఎప్పటికప్పుడు నిర్దేశించుకుంటూ ముందుకు పోవాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, ఇదే అత్యంత ప్రాధాన్యత అంశంగా గుర్తించి, ఆ దిశగా పనిచేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

ఇప్పటికే జీహెచ్‌ఎంసీ వర్షాకాల ప్రణాళికలో భాగంగా భారీ వర్షాలను సైతం ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకుని సంసిద్ధంగా ఉన్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు మంత్రికి వివరించారు. నగరంలో లోతట్టు ప్రాంతాలు, జలమయం అయ్యే ప్రధాన రహదారుల వంటి చోట్ల డీవాటరింగ్ పంపులు, సిబ్బంది మోహరింపు వంటి ప్రాథమిక కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఎస్ఎన్‌డీపీ కార్యక్రమంలో భాగంగా నాలాల బలోపేతం చేయడం వలన వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ సంవత్సరం ఇబ్బందులు తప్పుతాయన్న విశ్వాసాన్ని అధికారులు వ్యక్తం చేశారు.

Exit mobile version