హామీలన్ని అమలు చేస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

ఇందిరమ్మ రాజ్యంలో మాట ఇస్తే ఎంత కష్టం అయినా తమ కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు

  • Publish Date - February 28, 2024 / 12:50 PM IST

  • త్వరలోనే రేషన్ కార్డులు..ఇందిరమ్మ ఇండ్లు
  • మహిళలకు 2,500ఆర్ధిక సహాయం
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి


విధాత, హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యంలో మాట ఇస్తే ఎంత కష్టం అయినా తమ కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేరుస్తుందని, త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని, ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం, మహిళలకు 2,500ఆర్ధిక సహాయం అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మాదిరిపురంలో ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం శంకుస్థాపన చేశారు.


ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ హాస్టల్ మాత్రమే ఉండి ఇక్కడ క్లాస్ రూమ్‌లు లేకపోవడంతో రూ. 5 కోట్లతో పాఠశాల ఏర్పాటు చేశామన్నారు. అధికారంలోకి వచ్చిన 80 రోజుల్లో తమ ప్రభుత్వం ఏం చేస్తుందో మీరు చూస్తున్నారన్నారు. ఆరు గ్యారెంటీల్లో ఉచిత బస్సు పథకంలో ఇప్పటి వరకు 17 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారన్నారు. మరో రెండు పథకాలు అమలు చేస్తున్నామని, 200 యూనిట్‌ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని స్పష్టం చేశారు.


ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులో తప్పులు ఉంటే మళ్లీ అప్లై చేసుకోవచ్చునని తెలిపారు. రూ. 500 లకే గ్యాస్ఇ స్తున్నామని, అర్హులైన వారందరికీ ఇస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇస్తామని చెప్పి వందల్లో మాత్రమే కేసీఆర్ ఇచ్చారని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళు, మహిళలకు రూ. 2500 త్వరలోనే ఇస్తామని పొంగులేటి స్పష్టం చేశారు. ధరణి పేరుతో గత ప్రభుత్వంలో వేలాది ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు.


ధరణిలో ఇచ్చిన అప్లికేషన్‌లు వెనక్కి పంపించారన్నారు. ధరణిలో వచ్చిన రెండు లక్షల నలబై ఐదు వేల అప్లికేషన్‌లను పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేశారని, ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి చేసి నాసిరకంగా మార్చేశారన్నారు. ప్రాజెక్టులు కూలుతున్నా వారు చేసిన తప్పులు ఒప్పుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


గత ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన నష్టాన్ని సరిదిద్దే పనిలో ఉన్నామన్నారు. ప్రజలందరి దీవెనలతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం పాలేరు ప్రజలు పెట్టిన భిక్షని.. పదవులు, అధికారం శాశ్వతంకాదని పొంగులేటి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి వచ్చిన 11 నెలల్లోనే ఎంపీ అయ్యానని, పదవి ఉన్నా లేకపోయినా ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారన్నారు.

Latest News