Uttar Pradesh | విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచరే వికృత చర్యకు పాల్పడ్డాడు. కామంతో చెలరేగిపోయాడు. మాయమాటలు చెప్పి బాలికను లొంగదీసుకుని, గత రెండేండ్ల నుంచి అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని పలుమార్లు బెదిరించాడు. ఇక ఈ మధ్య వెలుగు చూసిన శ్రద్ధా హత్య కేసును ఉదాహరణగా చూపించి మరింత బెదిరింపులకు గురి చేశాడు. శ్రద్ధాను ఆఫ్తాబ్ ముక్కలు ముక్కలుగా నరికేసినట్లు నిన్ను కూడా నరికేస్తానని ఆమెను హెచ్చరించాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధిత బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ సిటీకి చెందిన సౌరబ్ గుప్తా(32) అనే వ్యక్తి స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో కంప్యూటర్ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై గుప్తా కన్నేశాడు. మంచి మార్కులు ఎలా సాధించాలో తన గదికి వస్తే చెప్తానని మాయమాటలు చెప్పాడు. మంచి విషయం చెప్తాడనుకొని భావించిన బాలిక.. గుప్తా గదికి వెళ్లింది. కానీ మార్కుల మాటలు వదిలేసి.. ఓ మృగం మాదిరి ఆమెపై విరుచుకుపడ్డాడు. అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. అలా రెండేండ్ల పాటు బాలికపై అత్యాచారం చేశాడు.
అయితే ఇటీవల శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసును ఉదాహరణగా తీసుకొని బాధితురాలిని మరింత బెదిరింపులకు గురి చేశాడు. గుప్తా. శ్రద్ధాను ఆఫ్తాబ్ ముక్కలు ముక్కలుగా నరికేసినట్లే నిన్ను కూడా నరికేస్తానని బాలికను భయపెట్టించాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు.. గుప్తా ఆగడాలను తన తల్లిదండ్రులకు తెలియజేసింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సౌరభ్ గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఒక్క బాలికపైనే కాదు.. చాలా మంది విద్యార్థినులను గుప్తా లొంగదీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.