Uttar Pradesh | ఓ భర్త తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భార్యను చంపి, తన పొలంలో పాతిపెట్టాడు. ఎవరికి అనుమానం రావొద్దనే ఉద్దేశంతో.. భార్య సమాధిపై మొక్కలను పెంచాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్‌కు చెందిన దినేశ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. దినేశ్ కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఆయన భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని దినేశ్ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో భార్యాభర్తలకు మధ్య గత కొద్ది రోజుల నుంచి గొడవలు ఉన్నాయి. జనవరి 25వ తేదీన దినేశ్‌కు తన భార్యతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన భర్త.. తన భార్యను చంపేశాడు. ఒక రోజు మొత్తం డెడ్‌బాడీని ఇంట్లోనే ఉంచాడు. ఆ మరుసటి రోజు తన పొలంలో శవాన్ని పూడ్చిపెట్టాడు. మృతదేహం త్వరగా కుళ్లిపోవాలని.. 30 కేజీల ఉప్పును గుంతలో పోశాడు. ఇక ఎవరికీ అనుమానం రాకుండా ఆమె సమాధిపై మొక్కలను పెంచాడు.
అయితే రెండు రోజుల తర్వాత.. తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు దినేశ్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దినేశ్ ప్రవర్తనపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తన భార్యను తానే చంపినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు.