Site icon vidhaatha

Miryalaguda | క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్..1.12 కోట్ల నగదు స్వాధీనం: SP అపూర్వరావు

Miryalaguda

విధాత: మిర్యాలగూడ(Miryalaguda) కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న 9 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 1కోటి 12 లక్షల రూపాయల నగదు, 30 లక్షల విలువైన రెండు కార్లు, మూడు లక్షల విలువైన 14 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అపూర్వరావు తెలిపారు. బుధవారం పోలీస్ హెడ్ క్వార్టర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె నిందితులను హాజరు పరిచి, వివరాలు వెల్లడించారు.

మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మయూరి నగర్ హౌసింగ్ బోర్డ్ లో సాయి దత్త అపార్ట్మెంట్లో 303 ఫ్లాట్ నెంబర్ ఇంటిలో చట్ట విరుద్ధమైన క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు ఆకస్మిక దాడి చేసి 9 మంది నిందితులను పట్టుకోవడం జరిగిందన్నారు. ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ లో కీలకంగా ఉన్న ప్రధాన నిందితుడు బంటు రాజేష్ కుమార్ గత మూడు సంవత్సరాలుగా ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడన్నారు.

టెలిగ్రామ్ యాప్ ద్వారా హార్దిక్ బుక్కీ ప్యానల్ నుండి మెయిన్ లైన్ యాక్సిస్ ని తీసుకుని ఈ లింకును తన బామ్మర్ది అయిన కోల సాయికుమార్ కు ఫార్వర్డ్ చేసి సదరు యాప్ ద్వారా మొబైల్ ఫోన్స్ కు కనెక్ట్ చేసి ఆన్ లైన్ లో నిందితుల సహాయంతో ఆన్ లైన్ కమిషన్ ద్వారా చాలామందిని నెట్వర్క్ లో జాయిన్ చేసుకొని ఆన్ లైన్, ఆఫ్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నడుపుతున్నారని తెలిపారు. సులువుగా డబ్బు సంపాదించడం కోసం వారు ఈ బెట్టింగ్ మార్గాన్ని ఎంచుకున్నారన్నారు.

రాజేష్ కుమార్ తో పాటు కోలా సాయికుమార్, రాచకొండ జీవన్ కుమార్, నోట్ల సత్యనారాయణ, శాఖమూరి ఉదయ్ కుమార్, బంటు సంతోష్, గంధం నవీన్ కుమార్, బంటు వంశీకృష్ణ, కొండవీటి రాజేష్ లను అరెస్ట్ చేసి గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడు రాజేష్ కుమార్ పైన గతంలో హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లోను క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు చేయబడిందన్నారు.

జిల్లాలో ఎవరైనా చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన మిర్యాలగూడ(Miryalaguda) డి.ఎస్.పి వెంకటగిరి, మిర్యాలగూడ టౌన్ సిఐ రాఘవేందర్, ఎస్సై లు శివతేజ కట్టంగూర్ విజయ్ కుమార్, టూ టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ గఫార్, కానిస్టేబుల్స్ కొమ్ము రవి, రహిమాన్, హుస్సేన్, వీరబాబు, వెంకటేశ్వర్లు, సైదులును ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు.

Exit mobile version