విధాత : గవర్నర్ తమిళిసై ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంపై బీఆరెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం అనంతరం ఆయన బీఆరెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంపై బీఆరెస్ వైఖరిని వెల్లడించారు. తెలంగాణ నిర్భందం నుంచి విముక్తి అయిందని గవర్నర్ చెప్పడం సరికాదని, అలాంటి వ్యాఖ్యలు అమె స్థాయికి తగదన్నారు. 2014 లోనే తెలంగాణ నిర్బందం నుంచి విముక్తం అయ్యిందని.. ఇప్పుడు కావడమేమిటోనని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో గవర్నర్ అబద్దాలు చెప్పడం దురదృష్టకరమన్నారు.
గవర్నర్ ప్రసంగంలో కొత్తదనమేమి లేదని.. కాంగ్రెస్ మ్యానిఫెస్టో చదివినట్లుగా ఉందని సెటైర్ వేశారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి స్పష్టత ఇవ్వలేదన్నారు. గత పదేళ్లలో రాష్ట్రం తిరోగమనంలో ఉందని గవర్నర్ తన ప్రసంగంలో చెప్పడంతో పదేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని విస్మరించారన్నారు. రాష్ట్రంలో పంటల దిగుబడి, విస్తీర్ణం పెరిగింది నిజం కాదా? వరి ధాన్యం ఉత్పత్తి, 24 గంటల విద్యుత్ అందించింది నిజం కాదా? ప్రజలు విద్యుత్తు కోసం రోడ్డెక్కలేదన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణ అనేక అవార్డులు సొంతం చేసుకుందని గతంలో చెప్పారని, గవర్నర్ ఈ అంశాలన్నింటినీ మర్చిపోయినట్లున్నారన్నారు.
అబద్ధాలు చెప్పడం ద్వారా గవర్నర్ పదవిని అవమానించినట్లే అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి ఎంచుకున్న మార్గం ఏమిటో గవర్నర్ చెప్పలేదని, ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిన అరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో చెప్పులేదన్నారు. గవర్నర్ ప్రసంగంలో దళిత బందు ప్రస్తావనే లేదని, రైతుల పంటలకు బోనస్ ఇస్తామన్న హామీ గురించి మాట్లాడలేదన్నారు. . కాంగ్రెస్ హామీల నుంచి పలాయన వాదం పాటించేలా గవర్నర్ ప్రసంగం ఉందని అన్నారు. ప్రభుత్వం శ్వేతపత్రాలు ప్రకటించిన తరువాత అన్ని అంశాలపై మాట్లాడుతామని కడియం స్పష్టం చేశారు.