విధాత, హైదరాబాద్ : ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ పై దాఖలైన అనర్హత పిటిషన్ ను(MLA Sanjay, disqualification petition dismissed) స్పీకర్ గడ్డం ప్రసాద్( Speaker Gaddam Prasad) కొట్టివేశారు. గతంలోనే అనర్హత పిటిషన్ విచారణ ప్రక్రియను పూర్తి చేసిన స్పీకర్ ప్రసాద్ తీర్పు రిజర్వ్ చేశారు. బుధవారం దీనిపై స్పీకర్ ప్రసాద్ తన తీర్పును వెలువరించారు. సంజయ్ పార్టీ ఫిరాయించారనడానికి ఆధారాలు చూపించలేకపోయారంటూ అనర్హత పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నట్లుగా స్పీకర్ ప్రకటించారు. జగిత్యాల ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసి..తమ వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే.
8మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్..కడియం, దానం పిటిషన్లపై విచారణ
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో మొత్తం 8మందికి సబంధించిన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్ తీర్పు ఇచ్చారు. అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యదయ్య, సంజయ్ ల పిటిషన్లను విచారించిన స్పీకర్ వారు పార్టీ ఫిరాయించనడానికి ఆధారాలు లేవని, కేవలం తమ నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ది పనుల కోసం సీఎంను కలిశారంటూ క్లీన్ చిట్ ఇచ్చారు.
ఇక మిగిలిన ఎమ్మెల్యేలలో కడియం శ్రీహరిపై వచ్చిన అనర్హత పిటిషన్ విచారణలో భాగంగా పిటిషనర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపి వివేకానంద వాదనలను బుధవారం స్పీకర్ ప్రసాద్ నమోదు చేసుకున్నారు. ఈ నెల 19న మరోసారి హాజరు కావాలని స్పీకర్ ఆదేశించారు. దానం నాగేందర్ అనర్హత పిటిషన్ విచారణ ఈనెల 18న కొనసాగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ పూర్తి చేసి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని స్పీకర్‌ను ఆదేశించిన నేపథ్యంలో స్పీకర్ విచారణ ప్రక్రియను కొనసాగిస్తున్నారు.
సంజయ్ పిటిషన్ డిస్మిస్ పై మాజీమంత్రి జగదీష్ రెడ్డి రియాక్షన్
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్ డిస్మిస్ పై మాజీమంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ చట్టపరంగా, ఆత్మసాక్షిగా పని చేయడంలేదు అని విమర్శించారు . బహిరంగంగా పార్టీ మారి.. కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొంటున్నప్పటికి స్పీకర్ కి కనపడటం లేదా..? అని నిలదీశారు. బహిరంగంగా పార్టీ మారినట్లు అర్ధమౌతున్నా చర్య తీకోకపోవడం దురదృష్టకరం అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ వదిలినా కోర్టుల్లో శిక్ష తప్పదు అని వ్యాఖ్యానించారు. స్పీకర్ ఏకపక్ష నిర్ణయం ప్రజలు గమనిస్తున్నారు..
కాంగ్రెస్ చర్యల పట్ల ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం అని పేర్కొన్నారు.
