MLC Kavitha | కవితకు మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి

  • Publish Date - April 12, 2024 / 04:42 PM IST

కవిత పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు
15న తిరిగి హాజరుపరుచాలని ఆదేశాలు
కుటుంబ సభ్యులకు..న్యాయవాదులకు ములాఖత్‌

విధాత, హైదరాబాద్‌ : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆరెస్ ఎమ్మెల్సీ కవితకు మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి రౌస్ ఆవెన్యూ కోర్టు అనుమతించింది. కోర్టు అనుమతించడంతో తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ తమ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. అయితే కవిత న్యాయవాదులు సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కవితను జైలులోనే అరెస్టు చేసిన సీబీఐ శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు కవితను విచారించేందుకు ఐదు రోజుల కస్టడీ అనుమతించాలని కోర్టును సీబీఐ కోరింది. సీబీఐ అభ్యర్థను అనుమతించిన కోర్టు కవితకు 14వ తేదీ వరకు కస్టడీ విధించింది. 15వ తేదీన ఉదయం 10గంటలకు తిరిగి ఆమెను కోర్టులో హాజరుపరుచాలని ఆదేశించింది. సీబీఐ తన 11పేజీల కస్టడీ పిటిషన్‌లో కవితపై సంచలన అభియోగాలు మోపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూప్‌లో కవిత ప్రధాన సూత్రధారి అని కోర్టుకు నివేదించింది. నిందితులు విజయ్ నాయర్‌తో పాటు పలువురితో కవిత లిక్కర్ స్కామ్‌కు స్కెచ్‌ వేశారని, ఇందుకోసం ఢిల్లీ, హైదరాబాద్‌లో సమావేశాలు జరిపారని పేర్కొంది. కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం ఎమ్మెల్సీ కవిత పాత్ర స్పష్టమమవుతోందని కోర్టుకు తెలిపింది.

100 కోట్లు సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి అప్ నేతలకు కవిత అందించారని, కవిత సూచనతోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి రెండు దఫాలుగా రూ.25 కోట్లు అందజేశారని పేర్కొంది. నిందితుల వాట్సాప్ చాట్లు ఈ విషయాలను దృవీకరిస్తున్నాయని స్పష్టం చేసింది. వాట్సాప్ చాట్‌లను కోర్టుకు అందజేశామని తెలిపింది. బుచ్చిబాబు స్టేట్ మెంట్ ప్రకారం కవితకు ఇండో స్పిరిట్ సంస్థలో 33 శాతం వాటా ఉందని తెలిపింది. కవిత పీఏ అశోక్ కౌశిక్‌ వాంగ్మూలం ప్రకారం అభిషేక్ బోయినపల్లి సూచన మేరకు భారీ మొత్తంలో డబ్బు ఆప్ నేతలకు అందించినట్టు తెలిపారు. శరత్ చంద్ర రెడ్డి జాగృతి సంస్థకు 80 లక్షల ముడుపులు చెల్లించారని, డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని, నకిలీ ల్యాండ్ డీల్ చేయించి శరత్ చంద్రారెడ్డి నుంచి 14 కోట్లు తీసుకున్నారని సీబీఐ పేర్కోంది. శరత్ చంద్రారెడ్డి 14 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణలో ఆయన అరబిందో ఫార్మా కంపనీ ఉండదని కవిత బెదిరించారని, ఈ విషయాలను చార్జిషీట్లలో పొందుపరిచామని సీబీఐ న్యాయవాది కోర్టుకు నివేదించారు.

అంతకుముందు సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ కవిత వేసిన పిటిషన్‌పై న్యాయవాది విక్రమచౌదరి తమ వాదనలు వినిపించారు. సీబీఐ కవితను అరెస్టు చేస్తున్న విషయం రాత్రి 10.30వరకు చెప్పలేదని, న్యాయ సలహా కావాలని అడిగినా పట్టించుకోకుండా అరెస్ట్ చేశారని వాదించారు. కవితకు వ్యతిరేకంగా సీబీఐ చెబుతున్న సాక్షాలకు విలువలేదని, సెక్షన్ 41ను సీబీఐ దుర్వినియోగం చేస్తుందని, కవిత అరెస్టు చట్ట విరుద్దమని, ఆమె అరెస్టు కోసం ఎలాంటి కేసు లేదని వాదించారు. అయితే కవిత అరెస్టు అప్లికేషన్‌ను సీబీఐ మా ముందు ఉంచితే మేమే అనుమతించామని, కోర్టును ప్రశ్నించేలా కౌంటర్ వేయవద్దని న్యాయమూర్తి తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జీ తీర్పును రిజర్వ్ చేసి సాయంత్రం తీర్పు వెలువరించి కవిత కస్టడీని అనుమతించారు. కవితను కుటుంబ సభ్యులు, న్యాయవాదులు కలిసేందుకు ప్రతి రోజు సాయంత్రం 6నుంచి 7గంటల వరకు ములాఖత్ అనమతించారు.

మరిన్ని నెలలు జైలులోనే

లిక్కర్ కేసులో గత నెల 15న ఈడీ అధికారులు హైదరాబాద్‌లో కవితను అరెస్ట్ చేశారు. ఆమె కస్టడీని ఇప్పటికే మూడు సార్లు కోర్టు పొడిగించింది.కవిత రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 16 వ తేదీన విచారణ జరగనుంది. ఈ క్రమంలో కవితను సీబీఐ అరెస్ట్‌ చేయడం సంచలనంగా మారింది. సీబీఐ విచారణను సవాల్ చేస్తూ కవిత వేసిన మరో పిటిషన్ విచారణ ఈ నెల 26కు వాయిదా పడింది. కవిత ఈ కేసులో బయటకు రావాలంటే ఈడీ కేసుతో పాటు సీబీఐ కేసులోనూ బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న వారికి నెలల తరబడి జైలు జీవితం అనంతరమే బెయిల్ లభించింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం బెయిల్ పిటిషన్ ఈనెల 20న విచారణకు రానుంది. ఈ పరిణామాలు చూస్తుంటే ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవిత సుదీర్ఘ కాలం జైలులోనే ఉండాల్సిరావచ్చని నిపుణులు భావిస్తున్నారు.

కవిత అరెస్టుకు సీబీఐకి మార్గం సుగమం చేసిన ఈడీ

కవితను అరెస్టు చేయాలన్న సీబీఐ నిర్ణయానికి ఈడీ సహకరించిన తీరు యాదృచ్చికం కాకపోవచ్చని కేంద్ర దర్యాప్తు సంస్థలు పక్కాగా స్కెచ్ వేసుకునే అరెస్టు పర్వం ముగించాయని నిపుణులు చెబుతున్నారు. 41ఏ కింద సీబీఐ నోటీస్‌లు ఇచ్చినప్పటికి కవిత విచారణకు వెళ్లకపోవడం..సీబీఐ హైదరాబాద్‌కు రాలేకపోవడం వంటి పరిణామాల మధ్య ఈడీ హైదరాబాద్‌కు వచ్చి కవితను అరెస్టు చేసి హస్తినకు తరలించడం సీబీఐకి కలిసొచ్చింది. ఈడీ కేసులో తీహార్ జైలులో ఉన్న కవితను అరెస్టు చేసిన సీబీఐ మూడు రోజుల కస్టడీకి కూడా కోర్టు అనుమతి పొందడం ద్వారా కేసులో కీలక పురోగతి సాధించినట్లయ్యింది. కస్టడీ విచారణలో కవిత నుంచి సీబీఐ తనకు కావాల్సిన సమాచారం రాబట్టే అవకాశముంది. ఇందుకోసం ఇప్పటికే సేకరించిన సమాచారం..ఆధారాలు ఆమె ముందుంచి ప్రశ్నించనుంది.

నిజానికి కవితను సీబీఐ అరెస్టు చేయకుండా సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్ గట్టి ప్రయత్నమే చేశారని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం పైన 2022 జులైలో ఢిల్లీ లెఫ్టినంట్ జనరల్ సీబీఐ ఎంక్వయిరీ వేయగా, ఆగస్టు 20న సీబీఐ ఢిల్లీలో మొదటి విచారణ, సోదాలు చేపట్టింది. సరిగ్గా పది రోజులకు కేసీఆర్‌ బాహ్య ప్రపంచానికి తెలియకుండా రాష్ట్రంలోకి సీబీఐకి అప్పటి దాకా ఉన్న సాధారణ అనుమతిని వెనక్కి తీసుకుంటు ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తు క్రమంలో ఒక వేళ సీబీఐ హైదరాబాద్‌కు వస్తే కేసీఆర్‌ అనుమతి లేకుండా అది ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా చేశారు. కేసీఆర్ సీబీఐకి రాష్ట్రంలోకి రాకుండా ఇచ్చిన ఉత్తర్వులు కూడా ఫామ్‌హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం హైకోర్టుకు వచ్చినప్పుడు ఆక్టోబర్ 30న బయట పడింది. సీబీఐకి తెలంగాణ రాష్ట్రంలో సాధారణ అనుమతి రద్దు చేసిన నేపథ్యంలో కవితను అరెస్టు చేసి విచారించే పని ఆలస్యమైనప్పటికి..ఈడీ అరెస్టు చేసి ఆమెను ఢిల్లీకి తరలించడంతో సీబీఐ తన పని దిగ్విజయంగా పూర్తి చేసుకుని చట్టాల ఆటలో పైచేయి సాధించింది. అయితే తెలంగాణ రాష్ట్రంలోకి సీబీఐకి సాధారణ అనుమతి రద్దు చేస్తు కేసీఆర్ తీసుకున్న ఉత్తర్వులను సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రద్దు చేయకపోవడం ఈ వ్యవహారంలో మరో ఆసక్తికర పరిణామం.

Latest News