విధాత: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) విద్యార్హతలకు (Educational Qualifications) సంబంధించిన సర్టిఫికెట్లు కోరిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గుజరాత్ హైకోర్టు 25వేల రూపాయల జరిమానా విధించింది. మోదీ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో)(PMO) సమర్పించాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చింది.
మోదీ డిగ్రీ, పీజీకి సంబంధించిన వివరాలు సమర్పించాలని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్.. పీఎంవోలోని ప్రజా సమాచార అధికారి (పీఐవో), గుజరాత్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీలను ఆదేశిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. కోర్టు ఖర్చుల కింద 25వేలు చెల్లించాలని కేజ్రీవాల్‌ను ఆదేశించింది. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆదేశాలను గుజరాత్ యూనివర్సిటీ సవాలు చేసింది.
‘ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి పదవిలో ఉన్నప్పుడు అతడు డాక్టరేటా? నిరక్షరాస్యుడా అన్నదాంతో సంబంధం లేదు. అందులోనూ ఈ అంశంలో ప్రజా ప్రయోజనం ఏమీ లేదు. పైగా ఆయన (మోదీ) ప్రైవసీకి ఇబ్బంది కలుగుతుంది’ అని యూనివర్సిటీ తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు.
తాను 1978లో గుజరాత్ యూనివర్సిటీలో డిగ్రీ చదివానని, 1983లో ఢిల్లీ యూనివర్సిటీలో పోస్టుగ్రాడ్యుయేషన్‌లో చేరానని మోదీ చెబుతున్నారు. అయితే.. మోదీ తన నామినేషన్ పత్రాల్లో తన విద్యార్హతలను పేర్కొన్నారని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది పెర్సీ కవినా అన్నారు. అందుకే తాము సదరు డిగ్రీ సర్టిఫికెట్లను అడుగుతున్నాం తప్ప.. ఆయన మార్కుల షీట్లను కాదని స్పష్టం చేశారు.
దేశ ప్రధాని విద్యావంతుడై ఉండాలా?
మోదీ విద్యార్హతలను టార్గెట్ చేస్తూ ఢిల్లీ నగరంలో పెద్ద సంఖ్యలో పోస్టర్లు వెలిశాయి. ‘భారతదేశ ప్రధాన మంత్రికి చదవడం, రాయడం తెలిసి ఉండాలా?’ (“Kya Bharat ke pradhan mantri padhe-likhe hone chahiye?,”) అని అందులో ప్రశ్నించారు.