Gujarat Road Accident : కారు బానెట్ పై పడిన బైక్ ను, వ్యక్తిని కిలోమీటర్ ఈడ్చుకెళ్లాడు

మద్యం మత్తులో కారు నడిపిన ఉపాధ్యాయుడు బైక్ ను ఢీ కొట్టి బానెట్ పై ఈడ్చుకెళ్లిన ఘటన గుజరాత్‌లో సంచలనం సృష్టించింది.

Drunk teacher drags biker for nearly a kilometre on car hood

విధాత : మద్యం మత్తులో కారు నడిపి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఓ ఉపాధ్యాయుడు కారు బానెట్ పై పడిపోయిన బైక్ ను కిలోమీటరుకు పైగా ఈడ్చుకెళ్లిన ఘటన వైరల్ గా మారింది. గుజరాత్‌లోని మహిసాగర్ జిల్లా మోడాసా-లూనావాడ రోడ్డుపై మనీశ్ పటేల్ అనే ఉపాధ్యాయుడు సోదరుడు మెహుల్ పటేల్‌తో కలిసి మద్యం తాగి కారులో బయలుదేరాడు. ఈ క్రమంలో దినేశ్‌భాయ్ (50), సునీల్ (21) అనే ఇద్దరు వ్యక్తులు వెళ్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. ప్రమాదం తర్వాత కూడా కారును ఆపకుండా, దాని ముందు భాగంలో బానెట్ పై ఇరుక్కుపోయిన బైక్‌ను అలాగే కిలోమీటరుకుపైగా లాక్కెళ్లాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కారు బానెట్ పై బైక్ తో పాటు గాయపడిన ఓ వ్యక్తి ఉన్నట్లుగా..అతను కొంత దూరం వెళ్లాక కిందపడిపోయినట్లుగా వీడియోలో కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. అందులో మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించారు. నిందితులు మనీశ్‌ పటేల్‌, మెహుల్ పటేల్‌ను అరెస్టు చేసి రిమాండ్ చేశారు.