Drunk Man Offers Liquor To Tiger : ఓర్నీ….తాగితే పులి కూడా పిల్లియేనా..!

మధ్యప్రదేశ్‌లో రాజు పటేల్ అనే కూలీ మద్యం మత్తులో ఎదురైన పులిని పిల్లి అనుకుని, దానికి లిక్కర్ తాగమని బతిమాలాడాడు. పెంచ్ నేషనల్ పార్క్ సీసీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డై వైరల్‌గా మారింది. పులి అతనికి ఎటువంటి హాని చేయకుండా వెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగించింది.

Drunk man offers liquor to tiger

విధాత : మందుబాబులు ఫుల్ గా తాగక మత్తులో పాములతో చెలగాటం ఆడటం..రాష్ డ్రైవింగ్, టవర్లు ఎక్కడం వంటి వింత చేష్టలు..దుస్సాహసాలు చేయడం తరుచూ చూస్తుంటాం. కొందరు ధైర్యం కోసం మందు తాగేసి చేయాల్సిన పని చేసేస్తుంటారు. మరికొందరైతే మద్యం మత్తులో ఎదురుగా ఏమున్నా లెక్క పెట్టకుండా వ్యవహరిస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్ లో ఓ మందుబాబు మాత్రం మత్తులో పులికి ఎదురుపడి దానికి లిక్కర్ తాగించడం చూస్తే..ఓర్నీ..మందు కిక్కుకు ఇంత పవర్ ఉందా అనిపించకమానదు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన కూలీ రాజు ప‌టేల్‌(52) ఓ రోజు ఇంట్లో తయారు చేసిన మద్యం ఫుల్ గా తాగేసి..చేతిలో ఓ మందు బాటిల్ పట్టుకుని తాగుకుంటునే రోడ్డుపైకి వెళ్లాడు.

తెల్ల‌వారుజామున 3 గంట‌ల స‌మ‌యంలో మ‌ద్యం తాగుతూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న రాజు ప‌టేల్‌కు ఓ పెద్ద పులి ఎదురుపడింది. మనోడు మ‌త్తులో అది పెద్ద పిల్లి అనుకుని..ఏ పిల్లి పక్కకు వెళ్లు అంటూ ఆ పులిని ఏ మాత్రం లెక్కచేయకుండా దాని తలనుప్రేమగా నిమురుతు చేతిలో ఉన్న బాటిల్ లోని మందు తాగమంటూ బతిమాలాడాడు. ఎంత సేప‌టికి పులి ఆ మందు తాగ‌క‌పోయేస‌రికి కొద్దిసేపు ఇద్దరు(పులి, రాజు) కూడా మాట ముచ్చట సాగించేసి ఎవ‌రిదారిన వారు వెళ్లిపోయారు. ఇంతజరిగినా ఆ పెద్దపులి రాజు పటేల్ ను ఏమి ఆనకుండా పెంపుడు పిల్లి, కుక్క మాదిరిగా అతనితో వ్యవహరించడం అశ్చర్యపరిచింది.

సీసీ కెమెరాలతో వెలుగులోకి ఘటన

ఈ వింతకు సంబంధించిన వీడియో మధ్యప్రదేశ్ పెంచ్ నేషనల్ పార్కు అధికారులు చేపట్టిన సీసీ కెమెరాల తనిఖీలలో వెలుగుచూసింది. అది చూసిన అధికారులు అవాక్కయ్యారు. ఈ ఘటన ఆక్టోబర్ 4న జరిగింది. భారీ వర్షాల నేపథ్యంలో తీవ్ర అలసటకు గురైన బెంగాల్ పులి సమీపంలోని పెంచ్ టైగర్ రిజర్వ్ నుండి గ్రామంలోకి వచ్చిందని..దానిని తిరిగి స్పాట్‌లైట్లు, తేలికపాటి ట్రాంక్విలైజర్లతో తెల్లవారుజామున 3 గంటలకు అడవులలోకి తిరిగి పంపించామని..పులితో ఎవరికీ హాని జరగలేదని వెల్లడించారు.

అయితే ఈ వీడియో వైరల్ కావడంతో రాజు పటేల్ ఆ ప్రాంతంలో హీరోగా మారిపోయాడు. అంతేకాదు అతను తయారు చేసిన ఇంటి లిక్కర్ మాకు కావాలంటూ నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో పోలీసులు రాజును అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు మనోడికి భూమిమీద ఇంకా నూకలు ఉన్నందునే ఆ పెద్దపులి అతడిని ఏమి అనకుండా వెళ్లిపోయిందంటు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం తాగితే వచ్చే కిక్కుకు పెద్దపులి కూడా లెక్కలేకుండా పోయిందంటే..మనిషికి నేరాలు చేయడం ఓ లెక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.