విధాత: సాయుధ పోరాట విరమణ(ceasefire )పై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన(Maoist party statement) చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్రల ముఖ్యమంత్రులకు మావోయిస్టు పార్టీ ఎంఎంసీ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నామని..అయితే ముందుగా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూంబింగ్ ఆపరేషన్స్ , ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్రల(mmc) స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ ఓక ప్రకటనలో తెలిపారు. మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే సాయుధ పోరాట విరమణపై తేదీని ప్రకటిస్తాం అని పేర్కొన్నారు. ఎప్పటి నుంచి కూంబింగ్ ఆపరేషన్స్ నిలిపివేస్తే అప్పటినుంచి ఆయుధాలను వదిలేస్తామని ప్రకటించారు. ఆయుధాలను వదిలేస్తామని..అయితే తమకు ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వాలని కోరారు.
సీసీఎంలో తీసుకున్న నిర్ణయం మేరకు జోనల్ కమిటీలకు కూడా ఈ మేరకు సమాచారం ఇచ్చినట్లు మావోయిస్టు పార్టీ తన ప్రకటనలో వెల్లడించారు. బస్వరాజు ఎన్ కౌంటర్ తర్వాత పార్టీ పునర్నిర్మాణం, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించామని..ఆయుధ విరమణపై ప్రకటన చేస్తాం అన్నారు.
దేశం, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేస్తూ ఆయుధాలు త్యజించడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని మా పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని మేం సమర్థిస్తున్నాం. కేంద్ర కమిటీ సభ్యులు సతీశ్ దాదా, చంద్రన్న ఇటీవల ఈ నిర్ణయాన్ని సమర్థించారు. ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ సైతం తుపాకులను వదిలేయాలని భావిస్తోంది. అయితే మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు మాకు ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నామని అనంత్ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు మా పార్టీ కట్టుబడి ఉన్నందున ఈ నిర్ణయాన్ని సమష్టిగా చేరుకునేందుకు మాకు కొంత సమయం పడుతుందన్నారు. మా సహచరులను సంప్రదించి పద్ధతి ప్రకారం వారికి ఈ సందేశాలు తెలియజేసేందుకు సమయం కావాలన్నారు. ఇంత సమయం అడిగేందుకు ఇతర ఉద్దేశాలేమీ లేవు అని కూడా స్పష్టం చేశారు. త్వరగా కమ్యూనికేట్ చేసేందుకు మాకు వేరే సులభ మార్గాలు లేనందున ఈ వ్యవధిని కోరుతున్నాం అని తెలిపారు భద్రతా బలగాలు తమ కార్యకలాపాలు నిలిపివేయాలని, పీఎల్‌జీఏ వారోత్సవాలను నిర్వహించబోమని.. మా అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తామని హామీ ఇస్తున్నాం అని లేఖలో అనంత్ పేర్కొన్నారు.
ఈనెల 28న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మావోయిస్టులపై అనుసరించాల్సిన విధానాలకు సంబంధించి కీలక సమావేశం జరుగనున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఆయుధాల విరమణపై ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. మావోయిస్టుల ప్రకటనపై మూడు రాష్ట్రాల సీఎంలు, కేంద్రం ఏ విధంగా స్పందించబోతుందో చూడాల్సి ఉంది.
