హైదరాబాద్ : కొత్త సంవత్సర వేడుకల వేళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో మూడు వేలకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. పలువురిని అరెస్టు చేశారు.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1500లకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరు మహిళలు సహా 1239 మందిపై కేసులు నమోదు చేశారు. 938 బైక్‌లు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక రాచకొండ పరిధిలో 517 మందిపై కేసులు నమోదు కాగా, తనిఖీల్లో పోలీసులతో పలు చోట్ల వాహనదారులు వాగ్వాదానికి దిగారు.
హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. చాలా మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ఏడాది వేడుకలు నిర్వహించుకోగా, మరోవైపు యువత ఆనందాన్ని రెట్టింపు చేసేలా హోటళ్లు, పబ్‌లు, రిసార్టులు మిరుమిట్లు గొలిపేలా ఈవెంట్లు నిర్వహించాయి. కాగా, జంటనగరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. నగరంలోని ఫ్లైఓవర్లు, ఓఆర్‌ఆర్‌ను ఆదివారం రాత్రి 8 గంటలకే మూసివేశారు. పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై విమానం టికెట్ ఉన్నవారికి మాత్రమే అనుమతించారు.