Site icon vidhaatha

Mother Killed Her Child: భర్త అనుమానిస్తున్నాడని కన్న బిడ్డను కడతేర్చిన కసాయి తల్లి

Mother Killed Her Child: మానవుడి విజ్ఞానం దిగంతాలను దాటిపోతున్నా..మానవత్వం మాత్రం పాతాళానికి పడిపోతుంది. మానవ సంబంధాలు..కుటుంబ బంధాలు బలహీనమైపోతుండగా..చివరకు కన్నవారే కసాయిగా మారి విచక్షణ మరిచి తన సంతానాన్ని హతమారుస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవల సరిగా చదవడం లేదన్న కారణంతో ఓ తండ్రి తన ఇద్ధరు చిన్నారులను కడతేర్చి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం రేపింది. తాజాగా భర్త అనుమానిస్తున్నాడని ఓ కసాయి తల్లి కన్న బిడ్డను చంపేసింది.

వివరాల్లోకి వెళితే విశాఖపట్నం పరిధి పెదగదిలి కొండవాలు ప్రాంతానికి చెందిన గొర్రె వెంకటరమణ, శిరీషలకు 2013లో పెళ్లైంది. ఐదు నెలల కిందట వీరికి ఒక పాప పుట్టింది. వెంకటరమణ కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకొని నిత్యం మాటలతో వేధిస్తుండేవాడు. పాప పుట్టిన తర్వాత వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఇంట్లో సీసీ కెమెరా పెట్టి మరి భార్యను గమనించేవాడు. భర్త వైఖరితో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య శిరీష ఈనెల 13న నిద్రిస్తున్న తన పాపను దిండుతో నొక్కి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది.

ఎవరికీ అనుమానం రాకుండా ఉండడానికి తెన్నేటిపార్కు తీరానికి పాప మృతదేహాన్ని తీసుకెళ్లి సముద్రంలోకి దిగింది. కాసేపటికి బయటకు వచ్చి భర్తకు ఫోన్ చేసి, పాపతో తాను సముద్రంలోకి దిగగా కెరటాలు లోపలికి లాగేశాయని, ఒడ్డుకు వచ్చే సరికి పాప కళ్లు తెరవడం లేదని చెప్పింది. వెంకటరమణ పాపను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లుగా నిర్ధారించారు. తర్వాత భార్యపై అనుమానంతో వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మృతదేహానికి పోస్టుమార్గం చేయగా ఊపిరాడక పోవడం వల్లే పాప చనిపోయినట్లు నివేదిక వచ్చింది. ఆరిలోవ పోలీసులు శిరీషను అదుపులోకి తీసుకుని విచారించగా..భర్త అనుమానిస్తుండడంతో కోపానికి గురై పాపను చంపినట్లు ఒప్పుకుంది. శిరీషపై హత్య కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండ్ విధించారు.

 

Exit mobile version