Mother’s Crime: ఆర్థిక ఇబ్బందులు..కుటుంబ కలహాలు..అక్రమ బంధాలు.. కారణాలేమైనా ఇటీవల కాలంలో తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లిదండ్రులే తమ కంటి పాపలైన పిల్లల పాలిట కాలయములవుతున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో ముగ్గురు చిన్నారులు అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. అవురి జింతల చెన్నయ్య, రజిత దంపతుల పిల్లలు సాయికృష్ణ (12), మధుప్రియ (10), గౌతమ్ (8) మృతి చెందారు. తల్లి రజిత అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
తల్లి రజితనే పెరుగు అన్నంలో విష పదార్ధాలు కలిపి పిల్లలకు పెట్టి తాను కూడా తిన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే చెన్నయ్య మాత్రం పప్పు అన్నం మాత్రమే తిని పెరుగు తినకపోవడంతో అతనిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతనే విషం కలిపాడా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పని చేస్తున్న చెన్నయ్య నీటీ సరఫరా పనుల కోసం బయటకు వెళ్లి వచ్చే లోగానే ఈ ఘటన జరిగింది. పిల్లల మృతికి కుటుంబ కలహాలే కారణమని..భార్యభర్తల మధ్య విభేదాలతోనే ఈ దారుణానికి ఒడి గట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు.
బకెట్ లో ముంచి చంపేసింది..!
హైదరాబాద్ మైలార్ దేవ్ పల్లి అలీ నగర్ లో జరిగిన మరో దారుణ ఘటనలో ఓ తల్లి తన 15రోజుల చిన్నారిని బకెట్ నీళ్లలో ముంచి చంపేసింది. ముందుగా తాను స్నానం చేసి వచ్చే సరికి నీళ్లలో పడిపోయిందని చెప్పిన తల్లి పోలీసుల విచారణలో నిజం ఒప్పుకుంది. తమిళనాడుకు చెందిన మనీ, విజ్జులు కాటేదాన్ లోని పరిశ్రమలో పనిచేస్తున్నారు. భర్త మనీ కిడ్నీలు పాడై కుటుంబ పోషణ భారమవ్వడంతో కూతురి భవిష్యత్తుపై బెంగతో ఆమెను హతమార్చింది. మైలార్ దేవ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భార్యను హత్య చేసి సూట్‌కేసులో కుక్కిన భర్త
కట్టుకున్న భార్యను భర్త దారుణంగా కడతేర్చిన ఘటన బెంగళూరులోని హుళిమావు లోని దొడ్డకన్నహళ్లిలో చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన రాకేష్, గౌరీ అనిల్ సంబేకర్(32)లు కొంత కాలంగా ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ దొడ్డకన్నహళ్లిలో నివాసముంటున్నారు. భార్యపై అనుమానంతో రాకేష్ తన భార్య గౌరీని చంపి ముక్కలుగా నరికి ఆపై సూట్‌కేసులో మృతదేహాన్ని తరలించాడు. నిందితుడు రాకేష్ మృతురాలు గౌరీ తల్లిదండ్రులను పిలిచి తన నేరం ఒప్పుకున్నాడు. డీసీపీ సారా ఫాతిమా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.