కారు షెడ్డుకే.. పాత సామాన్ల వాళ్లు కూడా కొనే పరిస్థితి లేదు: ఎంపీ బండి
‘కారు సర్వీసింగ్ కు పోయిందట… తాగి కారు నడిపే మీ అయ్యలాంటోళ్ల వల్లే కారు షెడ్డుకు పోయింది. రిపేర్ కు కూడా పనికిరాకుండా పోయింది

– సర్పంచుల పోరాటానికి మద్దతు ఇస్తాం
– బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ కుమార్
విధాత బ్యూరో, కరీంనగర్: ‘కారు సర్వీసింగ్ కు పోయిందట… తాగి కారు నడిపే మీ అయ్యలాంటోళ్ల వల్లే కారు షెడ్డుకు పోయింది. రిపేర్ కు కూడా పనికిరాకుండా పోయింది. పాత సామానోళ్లు కూడా ఆ డొక్కు కారును కొనే పరిస్థితి లేదు’ అని బీఆరెస్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ కు దమ్ముంటే బీఆర్ఎస్ పాలనలో ఏ గ్రామానికి ఎన్ని నిధులిచ్చారో చెప్పాలని నిలదీశారు. రాబోయే ఎన్నికల్లో మోదీ చేసిన అభివృద్ధి, ఏ గ్రామానికి ఎన్ని నిధులిచ్చారనే వివరాలను పూర్తి స్థాయిల్ ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ది మూడో స్థానమే…రాసి పెట్టుకోవాలని జోస్యం చెప్పారు. సోమవారం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. సర్పంచులు వచ్చే వారం నుండి ఆందోళన చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయని, సర్పంచుల పోరాటం న్యాయమైనదేనని స్పష్టం చేశారు. బీజేపీ అధినాయకత్వంతో మాట్లాడి సర్పంచుల పోరాటానికి మద్దతిస్తామని తెలిపారు.
తెలంగాణలో సర్పంచుల పదవీ కాలం వచ్చేనెల 1న ముగియబోతోందని, ఈ క్రమంలో వారి ఆందోళనను దృష్టిలో ఉంచుకొని సర్పంచులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని అనేకసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ మేరకు లేఖ రాశానని చెప్పారు. గత ప్రభుత్వ తప్పిదాలను, సర్పంచులకు చేసిన మోసాలను సరిదిద్దాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ మాదిరిగా కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. చాలామంది సర్పంచులు చేసిన పనులకు బిల్లులు రాక అప్పులపాలై కూలీలుగా, పెట్రోల్ బంకుల్లో పనిచేసే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చాలాచోట్ల సర్పంచులు చేసిన పనులను రికార్డుల్లో నమోదు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదని, వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వంపై కేసు పెట్టాలన్నారు.
– కేసీఆర్ బార్ పెట్టుకుంటే సరిపోతుంది..
సిరిసిల్లలో కేసీఆర్ కొడుకు తనపై అవాకులు, చవాకులు పేలారని బండి సంజయ్ అన్నారు. ‘మీ అయ్య 24 గంటలు తాగి పండుకుంటున్నడు కదా… మీ అయ్యకు సీఎం పదవి ఎందుకు? బార్ పెట్టుకుంటే సరిపోతుంది కదా?’ అని ఎద్దేవా చేశారు. ‘నువ్వు ముస్లింల గురించి మాట్లాడుతున్నవ్ కదా.. హిందూ ధర్మమంటే నీకు గిట్టదు కదా.. మసీదు పెట్టుకో.. నీకు రాజకీయాలెందుకు?’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 99 శాతం మంది దేవుడిని నమ్మేవాళ్లున్నారు. నేనడుగుతున్న.. కేటీఆర్ దేవుడిని నమ్మని నాస్తికుడు… దేవుడిని నమ్మేవాళ్లు నాస్తికుడికి ఎందుకు ఓటేయాలో ఆలోచించాలన్నారు. కోట్ల రూపాయల ఆదాయం సంపాదించడానికే యాదగిరిగుట్టను నిర్మించామని చెప్పిన మూర్ఖుడు కేటీఆర్. తెలంగాణకు పట్టిన దరిద్రం కేసీఆర్ కుటుంబం. మీ అరాచకాలు, అహంకారంపై పోరాడి తరిమి కొట్టింది బీజేపీయేనని అన్నారు.
– మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్థానికుడు కాదు..
మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్థానికుడు కాదని, ఆయన ఏనాడూ కరీంనగర్ ప్రజలను పట్టించుకోలేదని బండి సంజయ్ విమర్శించారు. ఏనాడూ ప్రజలను కలవలేదని, ఎన్నికలొస్తున్నాయని తెలిసి డ్రామాలాడుతున్నడని, ఆయన మాటలను ఎవరూ పట్టించుకోవడంలేదని తెలిపారు. సొంత పార్టీ కార్యకర్తలే ఆయనను పట్టించుకోవడం మానేశారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 350కిపైగా స్థానాల్లో గెలవడం ఖాయమని, తెలంగాణలో 10కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఐఎన్డీఐ కూటమి కుక్కల చింపిన విస్తరిలా మారిందని, ఎన్డీఏ కూటమిలో చేరే పార్టీలకే భవిష్యత్తు ఉంటుందన్నారు. తెలంగాణలోనూ బీజేపీలో చేరే నాయకులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.