నినాదాలతో హోరెత్తిన థియేటర్
విధాత : తెలంగాణలో నిజాం పాలన కాలంలో రజాకార్లు సాగించిన దాష్టికాలపై రూపొందించిన రజాకార్ సినిమాను కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మమత థియేటర్లో ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ తిలకించారు. పలువురు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సినిమా చూసేందుకు బండి సంజయ్ రావడంతో థియేటర్ వద్ద, చిత్ర ప్రదర్శన సందర్భంగా జై శ్రీరామ్ నినాదాలు మారు మోగాయి. నిజాం నిరంకుశ పాలన, కాశీమ్ రిజ్వీ రజాకార్ మూకల దౌర్జన్యాలు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ప్రజల తిరుగుబాటు అంశాలతో కూడిన రజాకార్ సినిమా తెలంగాణ ప్రేక్షకులను, ప్రజలను ఆలోచింపచేసేదిగా ఉందని ఈ సందర్భంగా బండి సంజయ్ చెప్పారు. నిజాం సాగించిన అరాచక పాలన, హైదరాబాద్ సంస్థానం విలీనం వంటి అంశాలపై ప్రజలకు వాస్తవాలు చాటిచెప్పేలా సినిమా బాగుందని, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఈ సినిమా చూడాల్సిన అవసరముందన్నారు.