MRF |
ముంబై: మీరు సచిన్ తెండూల్కర్ (Sachin Tendulkar)ఆటను చూసుంటే.. ఆయన బ్యాట్ మీద కూడా మీ దృష్టి పడే ఉంటుంది. అక్కడ ఉన్న స్పాన్సర్ కంపెనీ పేరు సైతం మీ మదిలో ఉండే ఉంటుంది. అదే ఎం.ఆర్.ఎఫ్ (మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ). తాజాగా ఒక షేరు విలువ లక్ష రూపాయలు దాటిన తొలి భారత కంపెనీగా M.R.F రికార్డు సృష్టించింది.
ఒక వేళ మీరు కనక సచిన్ తెండూల్కర్ రిటైర్ అయిన 2013లో ఒక ఎం.ఆర్.ఎఫ్ షేరు (Share) ను రూ.14,300కు కొనుంటే దాని విలువ ఇప్పుడు ఏడు రెట్లు పెరిగి లక్ష రూపాయలయ్యేది. మంగళవారం 52 వారాల గరిష్ఠ దశను దాటి ఎం.ఆర్.ఎఫ్ ఒక్కో షేరు ధర రూ. 1,00,300 ను తాకింది. ట్రేడింగ్ (Market Trading)ముగిసే సమయానికి రూ.99,988 దగ్గర స్థిర పడింది.
అయితే అధిక షేరు ధర పెరగడం అనేది.. అత్యున్నత విలువైన సంస్థ (Most Valuable Organization) అనే హోదాను ఇవ్వలేదని ట్రేడ్ పండితులు పేర్కొన్నారు. ఒక కంపెనీ షేరును విలువైనదిగా చెప్పాలంటే మార్కెట్ మూలధన పెట్టుబడి, ప్రైస్ టు ఎర్నింగ్స్ నిష్పత్తి, లాభాలు మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. రూ. 42,390 కోట్ల మార్కెట్ మూలధనంతో ఉన్న ఎం.ఆర్.ఎఫ్ విలువ పరంగా పెద్ద కంపెనీల జాబితాలోకి రాదని తెలిపారు.
ఎందుకు షేర్ ధర పెరిగింది
మార్కెట్‌లో లిస్ట్ అయిన ప్రతి కంపెనీ అప్పుడప్పుడూ షేర్లను విభజించడం, బోనస్‌లు ఇవ్వడం చేస్తాయి. తద్వారా పెట్టుబడిదారులను ఆకర్షిస్తాయి. అయితే గత 50 ఏళ్లలో ఎం.ఆర్.ఎఫ్ ఎప్పుడూ ఈ విధానాలను అనుసరించలేదు. దీని కారణంగానే దాని షేరు ధర రూ.లక్షకు చేరింది. ఈ పరిణామాలపై స్పందించాలని కోరినా ఎం.ఆర్.ఎఫ్ నుంచి సమాధానం లేకపోవడం విశేషం.
అయితే పెట్టుబడిదారులు, ఔత్సాహికులు షేర్ల ధర పెరుగుదలను పరిగణనలోకి తీసుకోకపోవడమే మంచిదని ట్రేడింగ్ నిపుణులు చెబుతున్నారు. షేరు ధర పెరిగిన కంపెనీ బాగా చేస్తున్నట్లు కాదు.. తక్కువ ధర ఉన్న కంపెనీ పడిపోతున్నట్లు కాదని గుర్తుచేశారు. ప్రస్తుతం టైర్ల విపణిలో ఎం.ఆర్.ఎఫ్ వాటా క్రమంగా తగ్గుతోందని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ వెల్లడించింది.