విధాత: బీహార్‌లోని దర్బంగా నుంచి ముంబైకి బయలుదేరిన స్పైస్‌జెట్ విమానాన్ని వారణాసిలో అత్యవసరంగా పైలెట్ ల్యాండ్‌చేశారు. ఓ వృద్ధ ప్రయాణికులు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో విమానాన్ని మధ్యలోనే దింపాల్సి వచ్చిది. కళావతి దేవి (85) తన మనవడితో కలిసి దర్భంగా నుంచి ముంబైకి స్పైస్‌జెట్ విమానం ఎస్‌జీ 116లో సోమవారం బయలుదేరింది. సాయంత్రం 5.40 గంటలకు దర్బంగా విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటి తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించింది.
ఆ సమయానికి విమానం ఉత్తరప్రదేశ్ గగనతలానికి చేరుకున్నది. కాబట్టి పైలట్ వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనుమతి కోసం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) వారణాసిని సంప్రదించారు. సాయంత్రం 6 గంటలకు వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని దింపారు. అనారోగ్యానికి గురైన కళావతిని సమీపంలోని దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమె చనిపోయినట్టు ప్రకటించారు. ఎట్టకేలకు అదేరోజు 7.30 గంటలకు వారణాసి నుంచి ముంబైకి విమానం బయలుదేరింది