Murder | అత్తాకోడళ్ల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారి తీసింది. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న అత్తపై కోడలు కర్రతో విచక్షణారహితంగా దాడి చేసి చంపింది. ఈ దారుణ ఘటన తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని వడుకనపట్టి గ్రామంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. వడుకనపల్లి గ్రామానికి చెందిన షణ్ముగవేల్(63), సీతారామలక్ష్మి(58) దంపతులకు కుమారుడు రామస్వామి, కూతురు ఉన్నారు. కుమార్తెకు ఇటీవలే వివాహం కాగా, కుమారుడికి ఐదేండ్ల క్రితం మహాలక్ష్మి అనే మహిళతో వివాహమైంది.
పెళ్లి అయినప్పటి నుంచి అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఇరుగుపొరుగు వారు వచ్చి అత్తాకోడళ్లకు సర్దిచెప్పేవారు. ఈ గొడవలు మరింత ఎక్కువ అవడంతో.. కుమారుడు, కోడలికి ప్రత్యేకంగా ఇల్లు కట్టించి ఇచ్చారు. అయినప్పటికీ అత్తాకోడళ్ల మధ్య గొడవలు ఆగలేదు. ఇక అత్తను మట్టుబెట్టాలని కోడలు నిర్ణయించుకుంది.
దీంతో పది రోజుల క్రితం తెల్లవారుజామున 4 గంటల సమయంలో.. కోడలు మహాలక్ష్మి, మగాడిలా వేషం ధరించి, హెల్మెట్ పెట్టుకుని అత్త ఇంట్లోకి ప్రవేశించింది. అత్తపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేసి చంపింది మహాలక్ష్మి.
అయితే తనపై అనుమానం రావొద్దనే ఉద్దేశంతో అత్త మెడలో ఉన్న ఐదు తులాల బంగారం గొలుసును మహాలక్ష్మి ఎత్తుకెళ్లింది. దొంగలే ఈ పని చేసి ఉంటారని నమ్మకం కలిగించేందుకు మహాలక్ష్మి ప్లాన్ చేసింది. కానీ పోలీసుల విచారణలో అత్తను చంపింది కోడలే అని తేలింది. మహాలక్ష్మిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.